పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నివేదన

మా తండ్రిగారు శ్రీ వావిలాల సోమయాజులుగారు సాహిత్య రంగంలో ఎంతటి మహోన్నతులో స్వయంగా గ్రహించగలిగేంతటి సంస్కృతాంధ్ర సాహిత్య పరిచయం గానీ ప్రవేశంగానీ మాకు లేదు.

వారు బహుముఖీన ప్రజ్ఞాధురీణులని, ఆంధ్రసాహిత్యాకాశంలో వారొక ధ్రువతార అని నాన్నగారిని చూడటానికి మా యింటికి వస్తూపోతూ ఉండే కవి, పండితులనేకులు అంటూ ఉంటే వింటూండేవారము.

నాన్నగారు ఈ 'ఆంధ్ర కామాయనీ' కావ్యాన్ని తమ సాహిత్య కృషికి తలమానికంగా భావించేవారు. దీనిని యథామాతృకంగానే కాకుండా, మాతృకకు వన్నెపెట్టే విధంగా, హిందీ రాని తెలుగువారికిది స్వతంత్రమైన ప్రౌఢసుందర కావ్యమనిపించే విధంగా రచించారని మా తండ్రిగారు చెబుతుండేవారు.

ఈ ఆంధ్ర కామాయనీ కావ్యాన్ని నాన్నగారు సుమారు పాతిక సంవత్సరాలకు పూర్వమే రచించారు. అప్పట్లో ఇది 'స్రవంతి' అనే మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురింపబడింది. ఏ కారణంచేతనో మా తండ్రిగారు దీనిని పుస్తకరూపంలో వెలువరించకుండా చాలా కాలం ఊరుకున్నారు.

1992 జనవరిలో నాన్నగారు దివంగతులైనారు. అంతకు కొంత కాలం పూర్వం నుంచీ వారు అస్వస్థులుగా ఉన్నారు. అప్పుడు ఈ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించాలని వారు వేగిరపడ్డారు. కాని ముద్రణ పూర్తి అయ్యీ కాకుండానే వారు కీర్తిశేషులు కావటం మా దురదృష్టం.

వారు ఈ కావ్యాన్ని విద్యన్మూర్ధన్యులు, బహుభాషా కోవిదులు, మృదుమధురకవితా ప్రియంభావుకులు, రసజ్ఞ శేఖరులు, సహృదయ సమ్రాట్టులు, మన ప్రియతమ భారత ప్రధాని గౌరవనీయులైన శ్రీ పి.వి. నరసింహారావుగారికి అంకితం చెయ్యాలని కాంక్షించేవారు.

వారి అభిమతాన్ని మన్నించి ఈ గ్రంథాన్ని తమకు అంకితం చెయ్యటానికి అనుమతించిన గౌరవనీయులైన శ్రీ పి.వి. నరసింహారావు గారికి శతసహస్ర కృతజ్ఞతాంజలులు.

________________________________________________________________________________________

ఆంధ్ర కామాయని

459