సాహిత్యాచార్య, సాహిత్యరత్న, సాహిత్యబంధువు, మధురకవి, కవిభూషణ, కుమార ధూర్జటి - ఇత్యాదిగా ఎన్నో బిరుదులిచ్చి సత్కరించింది. అందుచేతనే సాహిత్య, నాటకరంగాలలో హేమాహేమీలందరూ ఆయన కాత్మీయులూ, సహవ్రతులూ ఐనారు. విస్సా అప్పారావు, త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి, కురుగంటి సీతారామ భట్టాచార్య, నోరి నరసింహశాస్త్రి, జమ్మలమడక మాధవరామశర్మ, మల్లంపల్లి సోమశేఖరశర్మ, తెలికిచెర్ల వేంకటరత్నం, వల్లభజోశ్యుల సుబ్బారావు వంటి పెద్దలాయనకు సాహిత్య సహవ్రతులైతే, డాక్టర్ మారేమండ రామారావు, ఓరుగంటి నీలకంఠశాస్త్రి, శ్రీసదన ప్రస్తుత పీఠాధిపతులు నృసింహభారతీస్వామి వారు (పూర్వాశ్రమంలో ఘట్టి నరసింహశాస్త్రి), టేకుమళ్ల అచ్యుతరావు, కామేశ్వరరావు వంటి వారు చారిత్రిక సహవ్రతులైనారు. స్థానం నరసింహారావు, బందా కనకలింగేశ్వరరావు, కూర్మా వేణుగోపాలస్వామి, మాధవపెద్ది వెంకట్రామయ్య, పులిపాటి వెంకటేశ్వర్లు ప్రభృతులు నాటకరంగంలో సహవ్రతులు కాగా, ఆయన వలన సాహిత్య భాసురులైన వారిలో కె.వి.యల్. నరసింహారావు, ఎక్కిరాల కృష్ణమాచార్య, జూలూరి హనుమంతరావు, బూదరాజు రాధాకృష్ణ, బండ్లమూడి సత్యనారాయణ, బొడ్డుపల్లి పురుషోత్తం, కేతవరపు రామకోటిశాస్త్రి, పేరాల భరతశర్మ, యామర్తి గోపాలరావు మొదలైన యశస్వులెందరో వున్నారు. ఇంతటి విస్తార - సాహిత్య నాటకరంగ బంధువర్గాన్ని బట్టే మనం ఊహించుకోవచ్చును సోమయాజులుగారి అర్థశతాబ్ది సాహిత్య జీవితం ఎలాటి నిరంతరాయయోగ సమాధియై సిద్దించిందో! ఈ యోగసిద్ధి వెనుక, అజ్ఞాతంగా, కృతజ్ఞత కూడా ఆశించని ఒక వ్యక్తి త్యాగ మహిమ అండదండలుగా వుంది ఆ వ్యక్తే ఆయన ప్రియధర్మపత్ని, నా చెల్లెలు - చిట్టెమ్మ. తొణుకు బెణుకు లేకుండా, సంసారాన్ని అహర్నిశలూ కంటికి రెప్పలాగా కాపాడగలిగిందామె పుణ్యమే. ఆయన ఇంతటి సాహిత్య పారిజాతమై వికసించడానికి గృహరంగంలో ఈమె సాహచర్యమూ, సాహిత్యరంగంలో శ్రీశివశంకరుల సాహచర్యమూ దోహదం చేశాయి.
ఎనిమిదేండ్ల మా చిట్టెమ్మను 14 ఏండ్ల సోమయాజులుగారు 13-5-1932న పెండ్లాడారు. చిట్టెమ్మ తండ్రి రాయప్రోలు రామశేషయ్య గారు గుంటూరు వాస్తవ్యులు, గుంటూరులోనే నివసిస్తున్న - సోమయాజులు గారి పెదతండ్రి - వావిలాల రామచంద్రశాస్త్రి గారీ సంబంధం కుదిర్చి పెండ్లి చేశారు. సోమయాజులుగారి తండ్రి, సత్తెనపల్లి వాస్తవ్యులైన సింగరావధాని గారు తల్లి మాణిక్యాంబగారు. 18-1-1918
32
వావిలాల సోమయాజులు సాహిత్యం-1