పింగళ నామ సంవత్సర పుష్యశుద్ధ సప్తమీ శనివారం నాడు సోమయాజులుగారు జన్మించారు. తాను పసిగుడ్డుగా వున్నప్పుడే తండ్రి స్వర్గస్థులు కావడంతో సోమయాజులుగారు నరసరావుపేట తాలూకాలోని విప్రులపల్లి అగ్రహారంలో మాతామహుల ఇంట పెరిగి, సత్తెనపల్లెలోని క్రైస్తవ ఎలిమెంటరీ స్కూలులోనూ, తరువాత నరసరావుపేట హై స్కూలులోనూ, పిమ్మట గుంటూరు ఎ.సి. కాలేజీలోనూ చదువుకొని, తెలుగు సాహిత్యం, దక్షిణ భారత చరిత్ర అభిమానవిషయాలుగా తీసికొని 1938లో పట్టభద్రులైనారు.
పట్టభద్రులైన తరువాత రెండేండ్ల కాలం గుంటూరులోని ట్యుటోరియల్ కాలేజీలలో అధ్యాపకులుగానూ, స్వాతంత్ర్య సమరయోధుడైన ఒక మిత్రునకు ప్రింటింగ్ ప్రెస్సు నిర్వహణలో సహాయకుడుగాను పనిచేశారు. 1940 నుండి 1947 వరకు శారదానికేతనం ప్రాచ్య విద్యా కళాశాలకు ప్రిన్సిపాలుగానూ, 1947 నుండి 1977 వరకు హిందూ కళాశాలలో ఆంధ్ర భాషాచార్యులుగాను పనిచేశారు. 1974, 1975, 1976 సంవత్సరాలలో - ఇంటర్, పి.యు.సి., బి.ఎ., బి.ఎస్‌సి., తరగతుల వారికి, ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి కరెస్పాండెన్సు విద్యాలయంలో ఆంధ్రోపన్యాసకులుగా కూడా పని చేశారు.
శ్రీవావిలాల కవిశేఖరుల సంతానం నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు, పెద్ద వాడైన ఛాయాపతిని, తన పెద తండ్రి నిస్సంతు కావడం చేత, ఆయన దత్తత తీసుకొన్నాడు. ఆ పుత్రుడు వివాహానంతరం కొద్ది కాలానికే, అందరి కడుపుల్లో చిచ్చుపెట్టి వెళ్ళిపోయాడు. పెద్దమ్మాయి భర్త కూడా అదే పని చేశాడు, సంతానమైనా కలగకుండానే. తక్కిన ఈ ముగ్గురూ ఆ ముగ్గురూ ఉన్నతవిద్యావంతులై ఆర్జిస్తూ, సద్గృహస్థులై సంతానవంతులై, తండ్రి కీర్తి నినుమడింప జేస్తూ ఉన్నారు.
'పూర్ణపురుషుడు' అనే మాట ఒకటి ఉన్నది కదా? సర్వతోముఖ నిష్కళంకమూ సుందరమూ శుభప్రదమూ ఆనందదాయకమూ ఐన మానవజీవితాన్ని తెలియజెప్పడాని కీ మాట వర్తించేట్లయితే, తప్పక శ్రీవావిలాల సోమయాజులుగారికి కూడా వర్తిస్తుంది. అయితే సాహిత్యంతో ప్రత్యక్షసంబంధం లేని మహాపురుషులకే ఈ మాట వాడకంలో ఉండడం చేత, సాహిత్య విశేషార్థం వచ్చేట్లు ఈయన్ని 'సాహిత్య పూర్ణపురుషుడు' అందాము.
శివాలోకనము
33