Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుంది. "The Poet's main glory is the power of Pictorial expression" అని. ఈ మానసిక చిత్రణాభివ్యక్తి వల్లే కవికి సుస్థిరప్రతిష్ఠ కలిగేది.

ఎవరకే మాట కొసమెరుపో అచ్చమైన కవికి తప్ప తెలియదు. చూడండి - విల్లు పట్టుకోలేనివాడు యుద్దమేం చేస్తాడు? ఉజ్జీవనంలో - "జారి పోయె నీ ననవిలు నిల్వనోపకను నా కరకంజము నుండి" అని అనుకుంటాడు మన్మథుడు. చేతికి చెమట పట్టిన మాట - 'కర కంజము' అనే శబ్దం చెబుతోంది. ఇది శబ్దశిల్పరహస్యం.

“భ్రష్టయోగి”లో “ఈ సకలము 'కాదు కా' దను వచస్సున లేదటె కాంక్ష గుప్తమై” అనే మాటవల్ల భ్రష్టత్వానికి పరాకాష్ఠని చూపించిన ఈ కవి, "ఆత్మార్పణం”లో - “నా ప్రాయం బిచ్చితి రాజరాజునకు నీ పాలోయి నా ఆత్మయే” అని, కర్ణుని మహాత్మని ఆవిష్కరించటంలోని ఔచిత్యాన్ని గమనించండి. ఇలా ఎన్నని ఎన్నిక చేసి చూపించేది? ఒక్కొక్క పద్యం ఒక్కొక్క రస గుళిక!

“కావ్య స్యాత్మా ధ్వనిః” అన్నాడు ఆనందవర్ధనుడు. కావ్యగత రసధ్వనిని ఆత్మతః వినగలగడమే రసజ్ఞత. భ్రష్టమైన సమాజంలో పరివర్తన చెంది, ఉజ్జీవనమై, కర్తవ్యాన్ని గ్రహించి, భావితరాల మీద వాత్సల్యంతో ఆత్మవిమర్శని విన్నవించుకుంటూ, మానవత కోసం లలిత జీవనం కోసం ఆత్మార్పణకైనా సిద్ధపడాలనే ధ్వని యీ శివాలోకనంలో ప్రవహిస్తోంది.

ఇంతటి ఉత్తమ కవితా సంపుటిని మా 'పింగళి - కాటూరి సాహిత్య పీఠం' అందించగలగటం ఒకానొక భాగ్యవిశేషం.

మహాకవులైన సోమయాజుల వారికి హృదయపూర్వక నమస్సులర్పిస్తున్నాను.

- ఆచార్య తిరుమల


28

వావిలాల సోమయాజులు సాహిత్యం-1