Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాగా, “భ్రష్టయోగి” అనే కవిత కూడా మేనక అంటిన విశ్వామిత్రుణ్ణి గుర్తుకు తెస్తూ రామాయణ స్పర్శతోనే వున్నట్టుగా కనిపిస్తూ వుంది.

పౌరాణిక ఇతివృత్తమైన కుమార సంభవం ప్రతిధ్వనించే కవితాఖండిక “ఉజ్జీవనము”. శివుని మీదికి దండెత్తి వెళ్లి, తన అశక్తతని అర్థం చేసుకొన్న మన్మథుని ఆంతర్యం ఉజ్జీవనంగా పొంగులెత్తింది. ఇలాగే, శివునికి ముడిపడ్డ మరో కవిత ధూర్జటి మహాకవి ఆంతర్యాన్ని నివేదించే “విన్నపము”. ఈ “ఉజ్జీవనము” “విన్నపము” - అనే రెండు కవితలూ నిజంగా శివాలోకానికి సంబంధించి, కావ్యశీర్షికని సార్థకం చేస్తూ ఉన్నాయి.

ఇంక, ఈ కావ్యంలోని "మాచలదేవి”, “కర్తవ్యము" - అనే రెండు కవితలు కాకతీయ చరిత్రకు సంబంధించినవి. ఈ రెండింటిలో శృంగార, వీరరసాలు తరంగితమవ్వడాన్ని సహృదయులు గమనించగలరు. అలాగే "వాత్సల్యప్రియ"లో వాత్సల్యరసం, "ఉజ్జీవనం”, “పరివర్తన", “విన్నపము”, కవితల్లో కరుణరసం. “భ్రష్టయోగి"లో శృంగారరసం, “ఆత్మార్పణం”, “బృహన్నలాశ్వాసం"లో వీరరసం - మనకి కనిపిస్తాయి.

రసస్థాయినిబట్టి రచన చేయటం మహాకవి లక్షణం. శృంగారరస శృంగాన్ని అధిష్ఠించిన ఈ క్రింద పద్యాన్ని చూడండి :-


"హాసౌజ్జ్వల్య రసోల్బణ ప్రథితమై ఆరగ్వధ ప్రక్రియన్
వాసించున్ సకలాశలందు ధరణీ పాలావతం సోన్నత
ప్రాసాద ప్రమదా వనాంత లతికా వాల్లభ్య పుష్టాళిలో
నీ సమ్మోహన ముగ్దరూప సుమ మో నీరేజపత్రేక్షణా!!”


ఇటువంటి పద్యాల్ని, కవుల ఱొమ్ముల్ని కాల్చి విడిచిన ఏ శ్రీనాథుడో గానీ రాయలేదు. ఆ భావాలు, ఆ పద్యగమనాలూ అలాంటివి. భవభూతి తన ఉత్తర రామచరిత్రలో అంటాడు.


"లౌకికానాం హి సాధూనా మర్థం వాగనువర్తతే
ఋషిణాం పునరాద్యానాం వాచ మర్థో౽నుధావతి”


ఋషుల మాట వెంట అర్థం వస్తుందట. అందుకే “నా నృషిః కురుతే కావ్యమ్” అన్నారు. ఋషిహృదయులకు తప్ప శివలోకనం ఏర్పడదు. ఎందుకంటే, ఈ కావ్యఖండికలన్నిట మనస్తత్త్వశాస్త్రం నిండివుంది. ఆ మనస్సు కొక రూపచిత్రణ


శివాలోకనము

27