తే. ఉందు రీలోకమున ధనమున్నవారొ
కరికి బంధువుల్, స్నేహితగణము అటె
యతఁడు ప్రాజ్ఞుఁడు, పండితుఁడైన పురుషుఁ
డిగ సమాజము భావించు నతని నెపుడు. 217
తే. అర్థ మెవ్వని కుండునో యతఁడె బుద్ధి
యుతుఁడు, పుణ్యుఁడు, సద్గుణ యుతుఁడు, జ్ఞాని
గాగ భావింపఁబడును జగాన సకల
జనగణంబుల చేత నౌ సత్య మిద్ది!218
తే. అర్థమున్నవానికిని ధర్మార్థకామ
ములు లభించు వానికి సర్వముననుకూల
ముగను నుండును ధనమును పొందనట్టి
వాఁడు కోరెడు నభివృద్ధిఁ బడయలేఁడు.219
తే. రాజ! అర్థమ్ము నుండి హర్షమ్ము, ధర్మ,
దర్ప, క్రోధములు, శాంతి, దమము -ఇట్టి
వన్నియు జనన మొందు నత్యధికముగను -
ఇద్ది సత్యమై యిలను వర్తించు చుండు.220
తే. స్వజనులను గూడి యుండుట, శాత్రవులను
నాశ్రయించుట యనియెడు నల్పక్రియకు
మధ్యనున్నది తారతమ్యమ్ము మివుల -
తుచ్ఛబుద్ధికి నియ్యది తోచదెపుడు.221
తే. నీకుఁ జెందిన యాతండు నిర్గుణుండు
శాత్రవులవాఁడు సుగుణ విశ్రాంతియుతుఁడు
నగుచు నుండఁగ వచ్చును - అయిన పరుఁడు
ఎన్నటికి నైన పరుఁడు గానే రహించు.222
తే. వీడి తన పక్షము, పరులఁగూడియుండి
ఆత్మపక్షమ్ము నాశన మందు వెనుక
శత్రువుల చేత కొద్దిలో సంహరింప
బడు నతండియ్యది యౌను పరమరూఢి.223
222
వావిలాల సోమయాజులు సాహిత్యం-1