Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. ఆచరింపగఁ గడు దూరమందు ధర్మ
    మున్న వాఁడు కరమ్మున నున్న సర్ప
    మును విడిచి నట్టి యాతనిఁబోలి సర్వ
    సౌఖ్యముల నొందుచుండు ప్రశస్త ముగను.224

తే. ఇతర ధనములఁ గాఁ జేయు నిచ్ఛయందు
    బరవనితలను నవమానపరచుటందు
    గోర్కెగలవారె విడువఁగా గోరవలయు!
    అనుచు వచియించువారు సర్వజ్ఞులెపుడు.225

తే. ఇతరుల ధనము లపహరించుటయును,
    పరనళినులను నవమాన పరచుటయును,
    హితుల నూహించుచు నవమానించుటయును,
    మూఁడు దోషాలు నాశనమూలకములు.226

తే. కార్యమును నిర్వహింపఁగాఁ గడగి ప్రాణ
    ములను నర్పించు ప్రభువొందు స్వర్గసీమ
    కనుక నిది యొక విషయమ్ము కాదు దేవ
    జనుల విషయమ్ము నైయుండు - సత్య మిద్ది.227

తే. సర్వదేశమ్ము లందున సతులు గలరు
    అఖిల దేశాల బాంధవులర్థిఁగలరు
    సుగుణ భూషణుఁడైన యా సోదరుండు
    లభ్య మౌ దేశ మెట కనరాదు కనఁగ.228

తే. గగన మున్నది గగనమ్ము గాగ నదియె
    సాగరముఁ బోలి యున్నది సాగరమ్ము
    రామరావణ మధ్యయో రణము కనఁగ
    నున్నయది రామరావణ యుద్ధమటుల.229

తే. పెద్దలెల్ల తెల్పినది యామోద ముద్ర
    మహితు లాయోధు లిచ్చిన మార్గమద్ది
    యుద్ధ మరణమ్ము నొందిన యోధుఁగూర్చి
    దుఃఖమొందంగ రాదని తోచు క్రమము.230


మధుప్రప

223