Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/146

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

'ప్రేమ '


తే. బహుళ శోభా మనోజ్ఞమ్ము ప్రణయ మద్ది
    దాని శక్తిని మర్త్యమౌ ప్రాణము పయి
    పురుషమైన, స్త్రైణమునైన, పూర్వమట్లు
    ప్రతియుగమ్మున, నెపుడో అప్రతిహతముగ.

తే. ప్రేమయన వర్ణనము సేయ వీలుగాదు
    చెలగి వర్ణింప నద్దాని చేరుకొనిన
    మునుపునెన్నడు ననుభూతి గొనని యట్టి
    అనుభవమ్మేదొ ఏతెంచి ఆవరించు.

తే. ఇది సహకరింపదు మనకు నెంతయైన
    అందువలనను పరికింతు మాది దాని
    పరము, మూలమ్ములైన ప్రవర్తనముల
    గూర్చి యర్థమ్ము గావించు కొనుట కొరకు.

తే. తొలుత మరియొక ప్రాణితో కలిసియుండ
    నాశపుట్టించి సంతోష మబ్బజేయు
    పిదప వరియించు నిరువుర ప్రేమికులుగ
    జేర్చి యొక చోట జీవింపజేయు ప్రేమ.

తే. ఎవరి ప్రేమింతురో వారి కిచ్చవడుచు
    సేవఁజేయ నాతురతను జెందుచుంద్రు
    ప్రేమ నశియింప జగతిలో వీక్షసేయ
    లభ్యమవుదురె ప్రియగాని ప్రియుడు గాని?

తే. ప్రేమ వహియించుటయు లేక ద్వేషపడుట
    మనదు శక్తిలో నేనాడు నొనరబోదు
    జాతిమత ధనాదులను వీక్షణము సేయ
    కుద్భవించెడు ప్రణయమే ఒప్పు సాక్షి. 6


146

వావిలాల సోమయాజులు సాహిత్యం-1