Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'తెలుగు నాగు '

(ధరణికోట దిబ్బమీద పడివున్న నాగప్రతిమను చూచిన తర్వాత వ్రాసినవి)


తే. ఏ పురాతనశిల్పులో యిచట మలచి
    నగర సంరక్షణార్థమై నాగరాజ
    విగ్రహంబును ప్రేముడి వేసి చనిరి
    దివ్యలోకాల శిల్పమ్ము తీర్చిదిద్ద.

తే. ఆంధ్రరాజుల శౌర్యాగ్ను లణగిపోయి
    స్వీయగాథలు చెప్పుకో సిగ్గు వడెడు
    ఆంధ్రజాతికి కర్తవ్య మతడు నేర్ప
    నిలచియున్నాడు దిబ్బపై నేటివరకు.

తే. తెలుగు రేడులు రాజ్యమ్ము దివ్యదీప్తి
    పాలనము చేయ స్వాతంత్య్రపథమునందు
    నవనవోన్మేష శక్తితో నర్తనంబు
    ఒడలు పులకింప చేసిన ఒడయ డతడు.

తే. శత్రువీరుల పౌరుష సాహసమ్ము
    సప్తజిహ్వాగ్రవిషముతో సమయజేసి
    రక్తబంధూక నేత్రాంచలముల నగ్ని
    కణము లొలుకగ పోద్రోలె కలుషరిపుల.

తే. ప్రతిదినంబును సంజలు పడెడు వేళ
    సకల రాజన్యలోకాల చక్రవర్తి,
    తెలుగు సమ్రాట్టు, దీపితదివ్యయశుని
    అవనతనతుల నాత డందుకొనియె.


136

వావిలాల సోమయాజులు సాహిత్యం-1