Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. చనుట అలవాటు నాగులచవితినాడు
    రుచ్యమగు పదార్థాలతో రూపవతులు,
    నిత్య సముపార్జ సౌందర్య నిలయ, లైన
    ఆంధ్రరాజుల దేవేరు లతని కడకు. 6

తే. అతని ముందఱ నిడి గాని ఆరగింప
    మనసు పోలేదు నాటి సామాన్యునకును
    పుణ్యమూర్తి యని ప్రజాపూజ లంది
    అన్యు లెరుగని గౌరవం బనుభవించె.

తే. అన్యరాజన్య మస్తక హనన వేళ
    సమర సేనలు తనముందు చనుట చూచి
    తనదు పరిపూత మంగళ తనువు విప్పి
    దీవనల నిచ్చి పంపించు దీక్షతోడ.

తే. అర్ణవత్రయమధ్యస్థితాంధ్రభూమి
   తెలుగు రేడుల చేతిలో తిరము జెంది
   నిత్యకల్యాణ మందగా నేత్రయుగళి
   బాష్పపూరమ్ము లొలికించె పాపరేడు.

తే. అట్టి మహనీయమూర్తియో నతడు నేడు
    కంటకాకీర్ణ సంకుల కాననమున
    చూడవచ్చినవారలు శోషిలంగ
    నిలచి విలపించుచున్నాడు కలతదృష్టి. 10

'(భారతి, 1940-నవంబర్)'


మధుప్రప

137