'స్వామి '
తే. కోటికొండల బరువెత్తి కూలబడిన
ఇనుప పాదాల మర్దింతు వేలనోయి?
నీవు నీపూలవనిలోన నిలుపుకొనిన
మావిగున్నను పెకలింప మన సదేల?
తే. మంచు తెరలను నాదారి మరగుపరచి,
ముల్లు గర్రను చేపట్టి, ముక్కు త్రాళ్ల
చేత లాగుచు, నదలింప చేతనౌనె,
స్వామి, ఒక బెత్తె డేనియు సాగినడవ!
తే. అలసిపోయెను నాగుండె ఆటకట్టె
ఎత్తు వేయగ లేనింక ఏడిపింప
నేటి న్యాయమ్ము సఖులలో నెంచి చూచి
ఆట చాలింపు మదియె నాయభిమతమ్ము.
తే. తండ్రి, నా పేదయెద రహదారిమీద
ఎంతమందిని నడిపింతు విట్లు నీవు
ఎన్ని పుట్ల బరువు మోయ నిచ్చగింతు
వూసులాడుచు కుములు నీయోటిబండి!
తే. వెల్ల వేసిన పెండ్లిల్లు వీథిలోన
నాటకమ్మాడ కట్టిన తాటిపాక
పూటగంజికి లేనట్టి బాటసారి
బ్రతుకు నాయది వేధింప భావ్యమగునె?
తే. ఆశయ మ్మొక్కటే నన్ను పాశబద్ధు
చేసి నిలుపుచు నున్న దీచేతగాని
పడవవానిగ నా నావ పగులగొట్ట
తలప వలదయ్య యొక వసంతమ్ము వరకు.6
'(భారతి, 1941-విక్రమ, ఫాల్గుణ)'
మధుప్రప
135