Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. మహిత వేదమగు చతుర్థి మంగళమ్ము
    పిదప రాబోవు విరహ సంవేదనమ్ము
    నూహగావించి కౌగిలి నొంద స్వేద
    బిందువుల్ దంపతుల నేత్రబిందులయ్యె.

తే. "క్రొత్తగా వచ్చు పండ్లతో కొరికె కొడుకు
     ఇదిగో చూడుండునుచును ఇంతి పతికి
     నవ్వుచును చూప తన బుగ్గ నాథుడధిక
     రక్తియోజించి ముద్దిడె ప్రక్క బుగ్గ.

తే. లేడి ఒక్కటి కుడినుండి లీల వెడల
    ఎడమవైపు ప్రయాణమ్మె ఎపుడో ఆగు
    అట్టి ఎడ మృగములు రెండు అరిగెనేని
    ఆగకుండునే ఎట్టి ప్రయాణమైన? 30

తే. ఓసి వార్ధక్యమా! తుష్టినొందు మీవు
    ఉత్సహించి నా తలక్రింద యువకులెల్ల
    విఘ్ననాయకు దిండుగావించినారో?
    ఆ మహాత్మున కిప్పు డే అంజలింతు.

తే. చెలగి క్రీడగ తొండంపు చిగురుచేత
    కడలి జలమెల్ల చేసి ఆకర్షణమ్ము
    అంత జృంభించి బడబాగ్ని నాకసమ్ము
    క్రమ్మ జేసిన గణపతి ఘనుని గొలుతు.

తే. కోపమున నెర్రవడుచు సంక్షోభపరచు
    గౌరి ముఖ చంద్రబింబమ్ము ఘోరరక్త
    వర్ణ జలజ విభ్రమ గొల్పు పరమశివు డొ
    లికెడి మహనీయము జలాంజలికి నమస్సు

తే. కరము పైనున్న సర్ప కంకణము దూర
    ముగ పతి, పశుపతియె నిల్ప ముద్దుచెల్లు
    పార్వతిని గూర్చి సౌభాగ్యవతి యటంచు
    పరిణయమ్మున చేసిరి భావనమ్ము.


మధుప్రప

123