Jump to content

పుట:Vavilala Somayajulu Sahityam-1.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


తే. ప్రథమమున, మధు మదనుడు, వామరూప
    ధారి జృంభించి బలిని బంధనమొనర్చి
    నటుల ఈయమ స్తనయుగమ్మద్భుతముగ
    ప్రౌఢముగ పొందె అవ్వలి బంధనమ్ము.

తే. కృష్ణ! సౌభాగ్య గర్వాన క్రీడ వోలె
    గోకులమ్మెల్ల తిరిగెదు కోరి యెడద
    స్త్రీల గుణదోషముల విచారించుటందు
    తెలివి నేర్పున్న నట్టులె తిరుగుమయ్య!

తే. వయసు పెరుగగా నతని వివాహవేళ
    దగ్గరకు జేరగా యశోదమ్మఁ జేరి
    గోపికల్ ఆమెతో చెప్పుకొనుచు నుండ్రి
    మధు మదనుతోడ వారి బాంధవములెల్ల.

తే. కలుష బుద్ధికి మరది నో కలువ కంటి!
    ప్రతిదినమ్మును తమ గోడపైన చిత్రి
    తమ్ము శ్రీరాము తమ్ముని ధర్మ చరిత
    చెప్పుచున్నది యతని సచ్చీలుఁ జేయ. 24

తే. వెలసి యెది పానశాలను వెల్గు నగ్ని
    అదియె వెలుగొందు పిమ్మట యజ్ఞశాల
    అతివ స్థిత్యంతమును పొందినంతమాత్ర
    పురుషులకు నిరాకృతి చేయబూనరాదు.

తే. వధువు కృత్రిమ సంతోషపటము నామె
    చెలులు చూపింప జారుడు చిత్రగతుల
    చిలిపి నవ్వులు నవ్వుచు వలపుటెరుక
    చొచ్చుచుండగా మదిలోన జూచుచుండె.

తే. భర్త గావించు నను ధనుర్ధ్వనికి ఎదురు
    చూచుచున్న ఓ బంధకి, సుదతి, ఇది అ
    కాల మేఘ గర్జాధ్వని గాన వృథగ
    పొందనేల రోమాంచమున్ పొలతి నీవు?


122

వావిలాల సోమయాజులు సాహిత్యం-1