పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

v


శ్రీనివాసో విజయతే

నా మాట

22-07-2008.

కె. వి. రమణాచారి, ఐ. ఏ. ఎస్.,

కార్యనిర్వహణాధికారి,

తి. తి. దేవస్థానములు,

తిరుపతి.

భారతీయ వాఙ్మయంలో విశ్వవిఖ్యాతిగాంచిన మహాకావ్యం “వాసిష్ఠ రామాయణం". వాల్మీకి మహాకవి సంస్కృతంలో రచించిన ఈ గ్రంథానికి “జ్ఞాన వాసిష్ఠం”, “యోగ వాసిష్ఠం", " మహారామాయణం" - ఇత్యాది అనేకనామధేయాలు కాలక్రమేణ ఏర్పడినాయి. ఇవన్నీ ఈ కావ్యప్రశస్తిని చక్కగా చాటుతూవున్నాయి. ఈ కావ్యంలోని ముఖ్య విషయం వేదాంతం. ఇందలి అధ్యాత్మతత్త్వాన్ని ఉపదేశించిన మహానుభావుడు మహర్షు లందరికీ మాన్యుడయిన వసిష్ఠమహాముని, ఆ దివ్యోపదేశాన్ని శ్రద్ధతో స్వీకరించిన శిష్యసత్తముడు అవతారమూర్తీ, రఘువంశ తిలకుడూ - అయిన శ్రీరామచంద్రుడు.

ఇంతటి ఉత్కృష్టగ్రంథానికి ఇటీవలిదాకా తెలుగులో వెలువడిన అనువాదాలు రెండే రెండు. ఆ రెండు అనువాదాల్లో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ద్విపదలో రచించిన ఈ "వాసిష్ఠ రామాయణం" ఒకటై వుండటం విశేషం! ఈ కావ్యం తాత్త్విక కవయిత్రి వెంగమాంబ రచించిన మొత్తం రచన లన్నింటిలోనూ చిట్టచివరిదై వుండటం ఇంకొక విశేషం!

అపూర్వములయిన అనేక కథలను ఆధారం చేసికొని ఆత్మతత్త్వాన్ని ఉపదేశించటం వాల్మీకి కావ్యంలోని రచనా ప్రణాళిక.