పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వేదాంత విషయాలు వెల్లడింపబడినాయి. ఇంతవరకు చెప్పబడిన ఈ కథలన్నీ కలిసి 'ఉత్పత్తి ప్రకరణం'గా రూపొందాయి. రెండవదైన 'స్థితి ప్రకరణం'లో శుక్రోపాఖ్యానము, శంబరో పాఖ్యానము, భీమాద్యుపాఖ్యానము, దాశూరో పాఖ్యానము, ఉపదేశోపాఖ్యానము - అనే కథల మూలంగా ఈ జగత్తు యొక్క స్థితి విశదీకరింపబడింది. మూడవది 'ఉపశమప్రకరణం'. ఇందులో జ్ఞానం ద్వారా ప్రపంచోపశమనం (అజ్ఞానం ఉపశమించటం) వల్ల కలిగే విధానాలు తెలుపబడినాయి. జనకోపాఖ్యానము, పుణ్యపావనులకథ బల్యుపాఖ్యానము, ప్రహ్లాదోపాఖ్యానం - మొదలయిన పదికథలద్వారా అజ్ఞానం ఉపశమించిన వెంటనే శాంతి కలిగి, జ్ఞానోదయం అవుతుందనే సత్యం ప్రవచింపబడింది. చతుర్థ, పంచమప్రకరణాల్లో అవిద్యావాళంచేత సుజ్ఞానం ఉదయించి, ఆత్మానందం (నిర్వాణం) సిద్ధించే విధము, ధారణాయోగం (ప్రాణాయామం)వల్ల చిరంజీవిగా కొనసాగేవిధానం మొదలైన అపూర్వమైన అంశాలు నిరూపింపబడినాయి. ఇందునిమిత్తమై చతుర్థ ప్రకరణంలో భుశుండోపాఖ్యానము మొదలుగాగల తొమ్మిదికథలు, అలాగే పంచమప్రకరణంలో కచోపాఖ్యానము మొదలైన ఆరుకథలు చక్కని దృష్టాంతాలుగా ప్రతిపాదింపబడివున్నాయి. అనువాద విధానం: ఇంతటి ప్రసిద్ధిగల ఈ తాత్త్విక కావ్యాన్ని తన ఆత్మ తరించటానికై రచిస్తూవున్నట్లు వెంగమ్మ ఈకృతి ఆరంభంలో అత్యంత నిరాడంబరంగా పేర్కొన్నది. అయినా, ఈ కావ్య మందలి ఆ యా ప్రకరణాంతద్విపద పంక్తుల్లో “సదములులై వ్రాసి చదివిన వినీన, నరులు తాపత్రయార్ణవము తరించి, పరమైన నిర్వాణపదము నొందుదురు" - అని ఫలశ్రుతి వ్యాజంతో ఈ కావ్యప్రయోజనాన్ని ప్రబోధించింది. సకలపురుషార్థ ప్రదమూ, విమలమోక్షాకరమూ - అయిన ఈ ఆధ్యాత్మిక కావ్యాన్ని అనువదించటంలో కవయిత్రి ఒక ప్రత్యేక పద్ధతిని అవలంబించింది.