పుట:Vasistha Ramayanamu dvipada kavyamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

102

వాసిష్ఠరామాయణము

కనులు స్వభావంబు - గాఁ జూచుపగిది
ఘనతరంబగు చిత్త - గతిలేక తాను 220

చేయఁగాఁ దగుపనుల్‌ - సేయుచునుండు;
నా యోగి యెఱుకతో - నఖిలభోగములంఁ

దెలిసి భోగించి తృ - ప్తిని బొందు, దురిత
ములు వాని నంటక - మురిగి నశించు

వారీతి యె ట్లన్న - నఖిలేంద్రియములు
చోరకులై తన్నుఁ - జొక్కింపవచ్చు

సమయమం దతఁ డతి - జాగరూకతను
భ్రమయ కాచోర న్వ - భావంబు లెఱిఁగి,

తొలఁగ కాచోరుల - తో మైత్రిఁ జేసి,
కలసిన ట్లుండి భో - గములను జెంది, 230

గెంటక తన్ను బొం - కించు కామాది
కంటకులను దాను - గాంచి వంచించి,

వాని నెల్లను దన - వశముఁ జేసికొని,
వాని కెందును దాను - వశుఁడు గాకుండు.

అది యెట్ల నన్న మ - హాబధిరుండు
పాదువుగా దారులఁ - బురముల, నదుల

నూరకే గనుచుఁ బో - వుచునుండుఁగాని,
వా రందుఁ బలికెడి - వార్తలు వినని

గతిఁదనప్రారబ్ధ - కర్మశేషముల
నతినిస్పృహుండునై - యనుభవింపుచును 240

నరయ జీవన్ముక్తు - డగుతుండి, తుదను
మురువు మీఱ విదేహ - ముక్తుఁడై, నభము