పుట:Varavikrayamu -1921.pdf/93

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

92

వరవిక్రయము

కమ :- ఆయనను మేము వేలములో అయిదువేల యైదువందల రూపాయలకుఁ గొన్నాము.

న్యాయా :- (ఆశ్చర్యముతో) అదెట్లు?

కమ :- నాకు కాళింది యను నక్కగారుండెడిది. ఆమెకై మాతండ్రిగారీ సంబంధము కొఱకు యత్నించుతఱి మున్నంగివారు పోటీకి వచ్చినారు. అప్పుడు పెండ్లికొమరుని వేలము జరిగి, ఆ వేలములో అయిదువేల అయిదువందలకు మా సొత్తయినారు.

లింగ :- అయ్యా! వట్టిది వట్టిది! అట్టిదేమియు జరుగలేదు! (వెంగళప్పను చఱచి) నీ బొడ్డు పొక్క! నిజముకాదని చెప్పవేమయ్యా!

వెంగ :- (ఉలిక్కిపడి లేచి) అయ్యా! అయ్యా! అంతా అబద్ధమండి. కావలిస్తే మా క్లయింటు గంగలో దిగి ప్రమాణం చేస్తాడు.

కమ :- (రెండు కాగితములు తీసి) అయ్యా! యిదిగో యిది మొదటి అగ్రిమెంటు. ఇది సొమ్ము ముట్టినప్పటి రసీదు. (అని యిచ్చును!)

న్యాయా :- (చదివి) ఏమయ్యా! ఈ రశీదులు మీరిచ్చినవేనా?

లింగ :- (గొల్లున) కావు కావు! మహాప్రభో! కల్పించినారు.

వెంగ :- నిశ్చయముగా ఫోర్జరీ అండీ! నిలువునా ఫోర్జరీ! ఇండియన్‌ పీనల్‌ కోడ్ నాలుగువందల అరవయ్యేడో సెక్షన్ ప్రకారము ఆపిల్లమీద ప్రాసిక్యూషనుకు ఆర్డరు దయచేయించక తప్పదు.

న్యాయా :- ఐతే అమ్మాయి! అగ్రిమెంటు ప్రకారము ఆ సంబంధము మీ యక్క కేల జరుగలేదు?

కమ :- కొనితెచ్చిన వరుని బెండ్లియాడుట గౌరవహీనమని మా యక్క బావిలోఁపడి మరణించినది. ఇదిగో యీ పత్రికఁ జిత్తగించినచో దమ కీ యంశము విశదము కాగలదు. (అని పత్రిక యిచ్చును.)