పుట:Varavikrayamu -1921.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాంకము

93

న్యాయా :- (చదివి) హరహరా! యెంతపని జరిగినది. ఆ కారణముచే ఆ చిన్నవానికి నిన్నుఁ జేసినారన్నమాట.

కమ :- చేయక తప్పినది కాదు. చేజిక్కిన సొమ్ము మరల చేపుటకు వారు నిరాకరించినందున ఆక్రయము నాక్రింద మార్చవలసి వచ్చింది.

లింగ :- అయ్యా! వాదము నిమిత్తము, వారుసొమ్ము ఇచ్చినట్లే నిశ్చయింపుఁడు. అయిన నది కట్నమగును గాని క్రయధన మెట్లగును?

కమ :- కట్నమునకును, క్రయధనమునకును గాసింతయు బేధము లేదు. ఉన్నదన్నను కట్నములు వివాహకాలమున నిచ్చుట గలదు. గాని, వేలము, బజానా, అగ్రిమెంటు, ముందు చెల్లించుట ఇట్టి యాచారమెచ్చటను లేదు. అందువల్ల నిది క్రయధనమగుట కాక్షేపణ మేమియు లేదు. అది యటుండనిండు! శుభలేఖలలో సర్వత్ర "వారి కుమారునకు వీరి కొమార్తెనిచ్చి" అని కదా యుండును. వీనిని జిత్తగింపుడు. (అని రెండు శుభలేఖ లిచ్చును.)

న్యాయా :- (ఒక శుభలేఖనెత్తి) "నాకొమార్తె చి॥ సౌ॥ కమలకు బ్రహ్మశ్రీ సింగరాజు లింగరాజుగారి కుమారుడు బసవరాజు నిచ్చి" (అని పఠించి, పక్కున నవ్వి) ఇది పురుషోత్తమరావుగారి శుభలేఖ. లింగరాజుగారి శుభలేఖలో నెట్లున్నదో (అని రెండవ దాని నెత్తి) నా కుమారుడు చి॥ బసవరాజును బ్రహ్మశ్రీ పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారి కొమార్తె చి॥ సౌ॥ కమలకు ఇచ్చి" సరే ఇకనేమి స్పష్టముగానే యున్నదే! ఏమి లింగరాజుగారూ! మీకుమారు నామె కిచ్చివేసినట్లు మీరొప్పుకొనియే యున్నారే?

లింగ :- అయ్యా! అన్యాయ మన్యాయము. మీ శుభలేఖలతో పాటు మాకుఁ గూడఁ గొన్ని యచ్చువేయించి పెట్టుఁడని బుద్ధి గడ్డితిని పురుషోత్తమరావుగారిని కోరగా ఈ ద్రోహము ఆయన చేసినారు.