పుట:Varavikrayamu -1921.pdf/92

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాంకము

91


నా తండ్రిగా రసహాయవాదులు. నాకు వకీలును బెట్టుకొనుట కవకాశము లేదు. చట్టమునందుఁ జెప్పఁబడిన యీడు రాకపోయినను స్వవిషయమును సమర్థించు కొనుటకుఁ జాలిన జ్ఞానమును సర్వేశ్వరుఁడు నాకుఁ బ్రసాదించినాఁడు. ఇట్టి స్థితిలో నామాట వినకుండుట నా కన్యాయము చేయుటకాదా?

న్యాయా :- చెప్పమ్మా, చెప్పు? నీవు చెప్పిన మాటలు రికార్డు చేయఁగూడదనవచ్చును గాని నన్ను వినఁగూడదనుటకు వీరెవరు?

కమ :- చిత్తము, చిత్తము. దావా సారాంశములు రెండు. మొదటిది నా తల్లిదండ్రులు నా నగలు హరింపఁదలఁచినారని. రెండవది అందులకై వారు నన్నుఁ గాపురమునకుఁ బంపలేదని. (నగలు మూట తీసి) ఇవిగో వారడిగిన వస్తువులు. వీనిని వారు నా వివాహ కాలమున నాకు బహూకరించినారు. బహూకరించిన వస్తువులు దిరుగఁ సంగ్రహించుటకు దాతకు హక్కు లేదు.

వెంగ :- కావలసినంత హక్కుంది. కలకత్తా తీర్పులు లక్ష చూపిస్తాను. ఏదీ నంబరు యైట్‌ వాల్యూము. (అని వెదుకును.)

న్యాయా :- ఆగవయ్యా నీ యల్ల లాటకాల! అమ్మాయి! రెండవ సారాంశమును గూర్చి యేమి చెప్పెదవు?

కమ :- ఇదియే తామించుక శ్రద్ధతో వినవలసిన విషయము. నా భర్త నా యింటికివచ్చి, నా యాజ్ఞానుసారము నడచుకొనవలసి యున్నదిగాని, ఆయన యింటికి నన్ను రప్పించుకొనుట కాయన కావంతయు నధికారము లేదు.

వెంగ :- కావలసినంత అధికారముంది. కలకత్తా ట్వంటీ సిక్సులో కాళ్లూ, చేతులూ కట్టి తీసుకుపోవచ్చునని కూడా వుంది.

న్యాయా :- అబ్బబ్బా! నీ వాఁగవయ్యా! ఎందుల కధికారము లేదమ్మా?