పుట:Varavikrayamu -1921.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

88

వరవిక్రయము


సీ. కరణము తొలి మలి కట్నాల క్రిందను
         కూటసాక్షుల గొఱుగుడుల క్రింద
   వెంట దోడ్తెచ్చు నేజెంటు ఖర్చుల క్రింద
         ప్లీడర్లు లాగెడు ఫీజుక్రింద
   చల్లఁగాఁ బెరిగిన స్టాంపుడ్యూటీ క్రింద
         తెమలని సాక్షి బత్తెముల క్రింద
   కోర్టు గుమాస్తాల కొల్పు ముడ్పుల క్రింద
        కడలేనియట్టి నకళ్ళ క్రింద

   రైళ్ళక్రిందను, కాఫీ హొటేళ్ళ క్రింద
   కొంపలుం గోడులును మాపుకొనుచు, నోడు
   వాఁడు బయటను, గెలిచినవాఁడు లోన
   నేడ్చుటెగాక, లాభ మింతేని గలదె.

బస :- (తనలో) పెంపుడు తండ్రి చివరకు నన్నెంత పేలవపఱచెను?

గీ. పెండ్లి కాఁగానె చదువు మాన్పించెఁ ప్రజలు
   కేరడము సేయఁ గోర్టు కెక్కించె నేఁడు
   ధనమె బ్రతుకైన పెంపుడు తండ్రి కంటె
   సవతి తల్లియె మేలు నిశ్చయముగాను!

న్యాయా :- (కాగితములు బల్లపై నుంచి) వెంగళప్పగారూ! యీ వ్యవహార మింతవఱకు రావలసినది కాదండీ! ఉభయులకును రాజీ చేయుట యుక్తమని నా యభిప్రాయము.

వెంగ :- (లేచి) కోర్టువారలా సెలవిస్తే కొంప మునిగిపోతుంది. మాక్లయింటు వంటి మర్యాదస్తుడు మద్రాసులో కూడా లేడండి. ఆయన పెళ్ళికి అయిదువేల అయిదువందల కరుకులు కట్నము యిచ్చారు!

లింగ :- (వెనుకనుండి మెల్లఁగా) అయ్యయ్యో! ఆ సంగతి మన మొప్పుకొనఁగూడ దయ్యా బాబూ! ఆయన తండ్రికని దిద్దుకోండి!

వెంగ :- అన్నట్టు పొరపాటు మనవిచేసాను. ఆయనకుగాదు కట్నం ఆయన కొడుక్కు. కాదు, కాదు తండ్రికి! ఆయన తండ్రి లక్షాధికారండి.