పుట:Varavikrayamu -1921.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నవమాంకము

(ప్రదేశము: న్యాయస్థానము.)

(న్యాయపీఠమున గూర్చుండి, అభియోగ పత్రము చదువుకొనుచు న్యాయాధిపతి, యెదుటఁ గుర్చీలో వెంగళప్ప, అతని వెనుక నిలబడి లింగరాజుగారు, బసవరాజు, రెండవవైపునఁ పురుషోత్తమరావుగారు, కమల.)

పురు :- (తనలో) నిజమే, కోర్టెక్కుటకంటెఁ గొఱత యెక్కుటే మేలు.

చ. మనుజుని ముంగట న్మొరడు మాదిరిగా మనుజుఁడు నిల్చి వే
    ర్మనుజుఁడు బల్ల గ్రుద్దుచును మాటికి మాటికి నేమి ప్రశ్న వే
    సినఁ దలయొగ్గీ యుత్తరము చెప్పుచు, నూర్పులు పుచ్చుచుంట కం
    టెను నవమాన మింకొకటి నిక్కముగా మహిలోన నున్నదే.

సీ. ధనలోభమో, పట్టుదలయో, దురాశయో
        వేధింప నిలువెల్ల వెఱ్రి యెత్తి
   కూటసాక్ష్యములను గూరిచికొని యిండ్లు
        వాకిళ్లు ముదుసళ్ళ వశ మొనర్చి
   బ్రోకర్లుసేయు దుర్బోధలు మది నమ్మి
        ప్లీడర్లు కోరిన ఫీజు లిచ్చి
   పూఁటకూళ్ళిండ్ల నూడ్పులు నాకి, వారి పం
        చల దాటియాకు; జాపలఁ బరుండి

   కోర్టే దేవాలయంబుగా కోర్టు నెదుటి
   మఱ్రులుం గంగరావులె మంటపాది
   కములుగా, జడ్జీ దైవంబుగా నిరంత
   రంబుఁ దిరుగుదురేమి కర్మంబొ ప్రజలు.

ఇంతకును-