వరవిక్రయము
నాంది
భూరివరిష్ఠమై, విబుధ - పుంగవ మంగళ వాక్సమృద్ధమై,
చారుతరాప్సరోనటన - సంభృతమై, సవినోదమై, యహం
కార వికార దూరమయి - గర్హ్యతరోభయశుల్క శూన్యమౌ
గౌరి వివాహసంస్మరణ - కల్గగఁజేసెడుఁ గాక! భద్రముల్.
ప్రస్తావన
సూత్ర:-(ప్రవేశించి) ఓహో! యేమి యీ సభాసమ్మర్దము! ఆ మహాకవి కావ్యము లనఁగానే యభిజ్ఞుల కేమి యాదరము! (పరిక్రమించి) ఓ సభాస్తారులారా! వర్తమాన వరశుల్క దుర్నయ దూరీకరణమునకై బుద్ధిరాజు వీరభద్ర రాయామాత్యులవారి కంకితముగా, మహాకవి కాళ్లకూరి నారాయణరావు గారిచే రచింపఁబడిన వరవిక్రయ రూపకమును విలోకించు నిమిత్తము విచ్చేసిన మీయెడ నే నత్యంతముఁ గృతజ్ఞుఁడను, ఏమనుచున్నారు?
గీ."కవి ప్రసిద్ధుఁడు; కావ్యమా - కాలవిహిత
మైనయది; మీరలా భర-తాగమమునఁ
జతురు; లటుగాన, మీ ప్రద-ర్శనము కొఱకుఁ
ద్వరబడుచు నున్నవార మెం-తయును మదిని."
అనియా?- చిత్తము చిత్తము- ఇదిగో యిప్పుడే యుపక్రమించెదము.
(తెరవంకఁ జూచి) ఓసీ! ఓసీ! యెక్కడ! ఒక్కసారి యిటురమ్ము.
నటి:-(ప్రవేశించి) ఏమా యధికారము! కొని పాఱవైచినట్లె గొంతు చించుకొనుచున్నారే?