పుట:Varavikrayamu -1921.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూత్ర:- ఓసి దెష్టా! కొనిగాక నినుఁగోసికొని వచ్చితి నంటే? నీ తండ్రి కిచ్చిన వేయి రూపాయల రొక్కము - నీకుఁబెట్టిన వేయి రూపాయల నగలు - ఏ గంగలోఁ గలిసినవి?

నటి:- మీ సొమ్ములు మీకుఁదిరుగ నిచ్చివేసిన నాకు విడియాకు లిచ్చెదరా?

సూత్ర:- ఆసి నీ బొడ్డుపొక్క! యిది అమెరికా దేశమను కొంటివా యేమి? కాదు కాదు- ఆర్యావర్తము. అబ్బో! ఆ యాట లిక్కడ సాగవు! బొందు మెడఁగట్టినచో, బొందిలోఁ బ్రాణముండువఱకును బందెగొడ్డువలెఁ బడి యుండవలసినదే.

నటి:- అట్లయిన నాసంగతి రేపాఁడంగుల సభలో నాలోచించెదము. కాని- యిప్పుడు నన్నుఁబిలిచిన పని యేమో సెలవిండు.

సూత్ర:- పాత్రములను సిద్ధపఱచితివా?

నటి:- సిద్ధపఱచుటయే గాదు- శీఘ్రముగఁ బ్రవేశింపవలసినదని చెప్పి కూడా వచ్చినాను.

సూత్ర:- అట్లయిన, వారింకను నాలసించుచున్నారేమి?

నటి:- మీ చెవులలోఁ జెట్లు మొలచినవా యేమి! ఆ చరకాగానము వినబడుట లేదా?

తెరలో:- చరకా ప్రభావం బెవ్వరి కెఱుక! జగతిలోన మన చరకా

సిరులతోడఁ దులఁదూగుచున్న యల-

సీమజాతి చూచుచున్న దేమఱక చరకా

సూత్ర:- ఔనే! అవిగో - భ్రమరాంబా, కాళిందీ, కమలా పాత్రములు చరకాగానముతోఁ బ్రవేశించుచున్నవి. మనము పోయి పయిపని చూతము రమ్ము. (ఇద్దరు నిష్క్రమింతురు)

ఇది ప్రస్తావన.

★ ★ ★