పుట:Varavikrayamu -1921.pdf/62

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాంకము

61


నాకు నిజముగ దుస్సహముగానే యున్నది! తప్పనిసరియైనచో, నీవుగూడ నీదారినే యనుసరింపుము కాని, అవమానమున కొడంబడి, నీయక్క కప్రతిష్ఠమాత్రము కలిగింపకుము! ఓ శరీరమా నీయవమానమును దప్పించుటకై, నిన్ను విడనాడి పోవుచున్నాను. ఓ జీవితమా నీకు జిరకాలచింత లేకుండ జేయుటకై, నీ లెక్క ముగించుచున్నాను? ఏమి హృదయమా యేమి చేయుచున్నావు? నీవు నిర్మలముగా నుండవలసిన నిముసమిదియే! సాహసమా నీవుసాయపడవలసిన సమయ మాసన్నమైనది. పిరికితనమా! నా దరికి రాకుము. దాక్షిణ్యమా నీవు దవ్వులకుం బొమ్ము. మోహమానీవు మొద్దువలె బడియుండుము. ధైర్యమా! నీవు దాపునకురమ్ము. కన్నులారా మీ కడసారి చూపులు కానిండు. (చీర చెంగులు బిగించుకొని బావికి ప్రదక్షిణము చేసి) ఓ కూపమా నా తొలిస్నానము నీ నీటితోనైనది, నా శరీరము నీ నీటితో బెరిగినది. నా తుదిస్నానము కూడ నీ నీటితోనె కావించి, నీవు పెంచిన శరీరమును నీకేసమర్పించుచున్నాను! వినుట అభినయించి అదిగో! ఆకాశవాణి - నన్నమ్మాయీ రమ్మని పిలుచుచున్నది. అమ్మా! ఇదిగో వచ్చుచున్నాను. హా! పరమేశ్వరా! (అని బావిలో పడును.)

ఇది పంచమాంకం.


★ ★ ★