పుట:Varavikrayamu -1921.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

వరవిక్రయము


హోటళ్ళలో టిఫెను, ఇంటిలోఁగూడ నింగ్లీషు, బయటకు గూడ పాడుమొగము, గొల్లవానిచేతి రొట్టె, గొడారువాని చేతిసోడా, స్వమతము నెడ రోత, స్వధర్మమునెడ విముఖత, పదవులకై ప్రాకులాట, బిరుదులకై పీకులాట, దాస్యమునకు ముందడుగు, త్యాగమునకు వెనకడుగు. ఇవితప్ప యింతవరకూ సంఘమునందు మీరు ప్రవేశపెట్టిన సంస్కారములగపడవేమి? ఓ దేశసేవా దురంధరులారా! ఈ కట్నములదుర్నయమునుగూర్చి మీ రించుకయినాలోచింపరేమి? శుల్కమననేమి? సుంకము, సుంకమననేమి పన్ను. ఈ పన్ను చెల్లించినఁగాని బాలికలకు భర్త యోగము లేదట. ఇంతకు మించిన యవమాన మింకేమున్నది? మీ బిడ్డల యవమానమును దప్పించలేని మీరు, మీ దేశమాతయవమానమేమి తప్పింపగలరు? మీయల్లుర పన్నుల నడ్డుకొనలేని మీరు, మీ దొరతనమువారి పన్నులనేమి యడ్డుకొనఁగలరు? ఎన్నెన్ని సంసారము లేటఁ గలిసిపోవుచున్నవో యెరుఁగుదురా! ఎందఱాఁడుబిడ్డల తండ్రులు ఏమిగతి దైవమా యని యెత్తుపడియున్నారో చిత్తగించితిరా, కాసునకు గతిలేనివాఁడు, కడుపుచీల్చి కంచుకాఁగడాలతో వెదకిన గాసింత యక్కరముముక్క కానిపింపనివాఁడు, కన్యనిచ్చెదమనగాఁనే కట్నము కొఱకెంత బిఱ్రబిగియుచున్నాడో గమనించితిరా? ఆఁడుపడుచుల యవమానమునిట్ల లక్ష్యము సేయుచున్న దేశమున కయ్యయో, అన్న వస్త్రము లుండునా! మగబిడ్డలంగన్న యొయ్యారులారా, కొడుకు పుట్టినది మొదలు, కొండంత యాశతో, కలలోగూడ కట్నములనే పలవిరించు కలికాల పిశాచము లారా! మీరు పుట్టినదిమాత్ర మాఁడుపుట్టువు కాదా? ఆడ పడుచు నిట్లవమానపరుచుట మిమ్ములను మీరవమాన పరుచుకొనుటకాదా? ఇకనైన బుద్ధితెచ్చుకొని మీదురాచారమును విడువుఁడు. విడువకున్న కాళింది యుసురు మీ కంఠములకు జుట్టుకొనక మానదు. ఓయాఁడుబిడ్డలంగను నదృష్టహీనురాండ్రా, ఆఁడుబిడ్డ పుట్టగానే ఆవలనైనఁ బారవేయుఁడు గాని అడిగిన లంచమిచ్చి పుస్తె కట్టించి అవమానముపాలు, మాత్రము చేయకుఁడు! చెల్లీ కమలా! యిరువురమొక కంచమునఁ దిని యొక మంచమునఁ బరుండి పెరిగినఁవార మగుటచే నిన్నువిడిచి పోవుట