పుట:Varavikrayamu -1921.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

వరవిక్రయము


యింకా వివాహం చేశారు కాదు. సమయము కాకనా? సంబంధాలు రాకనా?

లింగ :- సంబంధములు రాకేమీ! సమాధానము చెప్పలేక చచ్చిపోవుచున్నాను. అన్నట్లు నీవు పెండ్లిండ్ల బేరగాడవు గదా! నీ యెరుకలో జక్కని సంబంధ మేదయిన నున్నదా?

పేర :- చక్కందో గిక్కందో నాకు తెలియదు. మీకు సానుకూల పడుతుందో లేదో అంతకంటే తెలియదు. పడితే మాత్రం బంగారాని కెత్తు కెత్తయిన సంబంధం వొకటి సర్వసిద్ధంగా వుంది.

లింగ :- ఎవరు వారు?

పేర :- పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పంతులుగారికి యిద్దరు కొమార్తెలున్నారు. పెద్ద కుమార్తెకు పదమూడవయేడు. పక్వానికి వచ్చిన పండు! ముఖం ముద్దురోడు తూంటూంది. కళ్ళుచూస్తే కడుపు నిండ వలసిందే! చక్కగా చదువుతుంది.

లింగ :- సరేకాని కన్యకు గావలసిన చదువు, చక్కదనమువిగావు.

గీ. తిండి యొకప్రక్క వెలితిగాఁ దినవలయు,
   చెప్పకయె యింటిపనులెల్లఁ జేయవలయు,
   ఊరకే కొట్టినను పడియుండవలయు,
   ఇట్టి కన్యను వెతకి గ్రహింపవలయు.

పేర :- అలాగైతే మీరు చెప్పిన లక్షణాలన్నీ అచ్చంగా ఆ పిల్లవద్దనే ఉన్నాయి. మూడు మెతుకుల కంటె ముట్టదు. లేచింది మొదలు పరుండే వరకూ లేడిపిల్ల లాగు పని చేస్తుంది.

లింగ :- ఇంతకును కట్నమేపాటి యీయగలరు?

పేర :- అదిగో అక్కడే వుంది తంటా! ఆపిల్లలిద్దరకి వంటని వెయ్యేసి రూపాయలు బాలతొడుగు లున్నాయి. అయిదేసి వందలు వచ్చే మాతామహు డిచ్చిన మాన్యాలున్నాయి. అందువల్ల కట్నంలేకుండా చేసుకుంటామని కావలసినంత మంది కాళ్లకాడికి వచ్చి తిరిగి పోతున్నారు.