పుట:Varavikrayamu -1921.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాంకము

31

లింగ :- అట్లయినఁ గూర్చుండి అదేమో చెప్పుము. (అని కూర్చుండును.)

పేర :- (కూర్చుండి తనలో) ఈ ముండాకొడుకుదగ్గర ముక్కు సూటిగా పోగూడదు. ముందీదారి త్రొక్కుతాను. (పయికి) చెప్పుట కేముంది? పష్టుకళాసు పద్దుమీద బదులు కావలసి వచ్చాను.

లింగ :- ఎవరికి? ఏపాటి?

పేర :- ఎవరికో తర్వాత చెపుతాను. బదులు కావలసింది పాతిక వేలు.

లింగ :- వడ్డీ యేమయిన వాటముగ వేయించఁగలవా?

పేర :- వడ్డీకేం? వాజిబీ ప్రకారం పుచ్చుకోండి.

లింగ :- వడ్డీకి వాజిబీ యేమిటి! ఆసామిని బట్టియు, ఆస్తిని బట్టియు, అవసరమును బట్టియు నుండును. నీతోడు, రూపాయ తొమ్మిదణాలకాని చొప్పున నిన్ననే ముప్పది వేలిచ్చాను.

పేర :- అయితే కుదరదు. ముప్పావలా అంటే ముద్దుపెట్టుకుని ఇచ్చేవారున్నారు. సెలవు! (అని లేవబోవును.)

లింగ :- ఆగు! ఆగు! అంత తొందర పడకూడదు. ఆస్తిమాట చెప్పవేమి?

పే ర:- ఆస్తికేం! అవల్‌ రకం ఆస్తి. అరవై యెకరాల సర్వదుంబాలా యీనాంభూమి. పది యెకరాల బత్తానారింజతోట, ఆరెకరాల అంటు మామిడితోట, తొమ్మిదెకరాల తుమ్మబీడు, ఇదే ప్రథమ తనఖా. ఇక విడిపించుకునేది కూడా కాదు.

లింగ :- సరే ముప్పావలార్ధణా చొప్పున పయిసలు చేయుము.

పేర :- ముప్పావలార్ధణా లేదు గీవలార్ధణా లేదు. నా కమీషను దగ్గిర సలుపులు పట్టకపోతే రూపాయివరకూ రుద్దుతాను.

లింగ :- నీ కమీషను మాట కేమి? నీ వెక్కడికిఁ బోదువు? నే నెక్కడికిఁ బోదును? ముందు కాగితములు తెమ్ము, చూతము.

పేర :- కాగితాలకేం! రేపీపాటికి కాకిచేత రప్పిస్తాను, (అని లేవఁబోయి, మరలఁ జతికిలబడి) అన్నట్టు అడగడం మరచాను. అబ్బాయికి