పుట:Varavikrayamu -1921.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వితీయాంకము

33


లింగ :- అయితే పేరయ్యా! ఆ పిల్ల యొంటిని అచ్చంగా బంగారపు తొడుగుండుఁగాక అరువది పుట్ల మాన్యముండుగాక గౌరవము కోరువాఁ డెవ్వఁడైనఁ గట్నంలేని సంబంధముల కిష్టపడునా!

పేర :- అలాగైతే, గౌరవార్థమని మెడలు విరిచి కాస్తోకూస్తో ఇచ్చే లాగు చూడాలి. ఏమాత్రం అనమంటారు?

లింగ :- అసలు ఆయనకున్న అస్థియేమో చెప్పినావు కావు.

పేర :- ఆయనకున్న ఆస్తి యేమిటో అందరూ యెఱిగినదే. పది సంవత్సరాలు రెవిన్యూ యినిసిపేటరు పనిచేశారన్న మాటే కాని పయిసా పుచ్చుకొని యెరుగరు. ఈమధ్య నానుకోపరేషాన్ని నమ్మి ఆవుద్యోగానికి గూడా హస్తోదకాలిచ్చి హాయిగా రాట్నం ముందు పెట్టుకొని కూర్చున్నాడు. అయితే, పిత్రీయం బాపతు పదియెకరాల భూముంది. పన్నులు పోగా పదియెకరాల వల్లా పదిపదులు నూరుబస్తాలు వస్తాయి. వారు కాపురంవున్న మేడ వుంది.

లింగ :- అట్లయినచో, నటువంటి పెద్దమనుష్యులను మనమంత యిబ్బంది పెట్టుట న్యాయము కాదు, ఆ మేడ వారుంచుకొని ఆ పదియెకరముల పొలమును మనకు వ్రాసి యిచ్చి అందము కొఱకు వేయిన్నూటపదార్లు రొక్కము, వెండిచెంబు, వెండికంచము, వెండి పావకోళ్ళు, ఐదుదినముల నైదు పట్టుతాబితాలు ఇటువంటివి మాత్రమిమ్మనుము. నా బారీతనము బాగుగ నున్నదా?

పేర :- బాగేమిటి బంగారు తునక లాగుంది! కాకపోతే, కార్యమయిన మర్నాటినుంచి వారు అన్నమో రామచంద్రాయని ఆవీధినీ, యీవీధినీ అడుక్కు తినవలసి మాత్రం వుంటుంది! బాబూ! మీ బేరము కుదిరేబేరము కాదు! సెలవు పుచ్చుకుంటా. (అని లేవఁబోవును.)

లింగ :- (రెక్క పట్టుకొని) ఆగు ఆగఁవోయ్‌! అన్నిటిలో నొక్కటే తొందరా! నీ యభిప్రాయ మేమిటి?

పేర :- వేయిన్నూట పదహార్ల కయితే వెంటనే కుదురుస్తాను. అంతకు పయినైతే ఆ సంబంధం మీకు దక్కదు.