పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

5

ఉపోద్ఘాతము

కాదని వెంటనే ప్రత్యుత్తర మిచ్చునో లేదో చూడుఁడు. కోనబుద్దారెడ్డియే రచించి యుండినచోఁ దన విరచిత గ్రంథమునకు రంగనాథుని పేరేల తగిలించియుండును? కష్టపడి వ్రాసినకవి పుంగవుఁడు తన గ్రంథమున కితరుల పేరు పెట్టుట కంగీకరింపఁడు. అందువలన రంగనాథరామాయణము రంగనాథునిదే యనక తప్పదు. ఒక వేళ రంగనాథకవి ధనాకాంక్షచేతనో ప్రబలభీతిచేతనో తన రామాయణమునకు కోనబుద్ధరాజును కర్తగా జేయుట కంగీకరించి యుండి యుండవచ్చును. పాపము కవి యేకారణముచేతనో తన ప్రభువును రామాయణకర్తగాఁ జేయనెంచినను, భగవంతుఁడు సత్యమును వెల్లడించుటకేఁ గాబోలు దానికి రంగనాథరామాయణ మను నామమునే ప్రసిద్ధి యగునటు లొనరించి రంగనాథకవియే రంగనాథరామాయణకర్తయని నిరూపించెను. అదియుఁ గాక రంగనాథుఁడే రామాయణోత్తరకాండను గూడ రచించి కోనబుద్దరాజును కర్త నొనరించె నందురు. ఈవిషయమును గుఱించిన చర్చను బండితులకు వదలెదము.

భాస్కరుఁడు—శ్రీరామాయణము నాంధ్రీకరించినవారిలో భాస్కరకవి రెండవవాఁడు. రంగనాథుఁడు రామాయణమును ద్విపద కావ్యముగ రచింప భాస్కరుఁడు గద్యపద్యాత్మకముగ రచించెను. రంగనాథరామాయణ కర్తను గుఱించి కలిగిన సందేహమే భాస్కరరామాయణ కర్తను గుఱించియుఁ గలిగినందులకుఁ జింతింపవలసియున్నది. అందులకుఁ గారణ మొకేపేరుగల భాస్కరులు పెక్కురుంటచేతనే యనక తప్పదు. ఏది యెటులున్నను మహనీయులు సరి యగు 'భాస్కర రామాయణ’ కర్తను నిర్ణయింపఁగలిగిరి. అతనినే హళక్కి భాస్కరుఁడని దృఢపఱచిరి. ఈ భాస్కరుని యింటిపేరు మంగళపల్లివారనియు నతఁడు తన యసమానపాండిత్యమునుఁ జాటి యగ్రతాంబూలమును బొందెననియుఁ దాంబూలమునకుఁ గన్నడమున 'హళకి' యను పేరుండుటచే ఆపదమును భాస్కరుఁడు అను నామమునకుఁ బ్రథమమునఁ గూర్చి హళకి భాస్కరుఁడని పిలువఁ దొడఁగి రనియు, నయ్యదియె క్రమముగ హళక్కిగ మాఱి అతనికి మంగళపల్లి భాస్కరుఁడను పేరు మాసి 'హళక్కి భాస్కరుఁడు' అను పేరు నిలిచెనని కొందఱందురు. ఇతఁడు ప్రతాపరుద్రుని పండితసభలోఁ బ్రఖ్యాతి గాంచఁగలిగెను, ఇతఁడు రంగనాథకవికి సమకాలికుఁ డనియుఁ గోనబుద్దరాజు ఆస్థానకవి రంగనాథుఁడు రామాయణమును ద్విపదకావ్యముగ రచించి ప్రభువు మన్ననలకుఁ బాత్రుఁడు గానున్నాఁడని తాను గూడ ప్రభువు మన్ననలఁ బడయఁ గోరి రామాయణమును గద్యపద్యాత్మకముగ రచించి రంగనాథకవి రాజస్థానమునుఁ జేరుసమయమునకేఁ దాను గూడ వెళ్లి తానొక రామాయణమును రచించినట్లును,