పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

శ్రీ మ దు త్త ర రా మా య ణ ము

నామ మందలి శక్తి నిరుపమానము. అందులకే భారత దేశ మందు శ్రీరామాలయము గాని, రామ మందిరము గాని, కడకు రామ భజన సమాజము గాని లేని గ్రామ ముండదని గట్టిగఁ జెప్ప వచ్చును. పౌరాణికుని వలన రామాయణ కథను జెప్పించుకొని విని యానందింపని మానవుఁ డుండఁడనియే యనవలసి యున్నది.

శ్రీమద్రామాయణము సంపూర్ణ ప్రబంధ లక్షణములతోడను, నెనిమిది వందల ముప్పది సర్గల తోడను, బాల అయోధ్య అరణ్య కిష్కింధా సుందర యుద్ధ ఉత్తర కాండలను సప్త కాండములలో దేవ భాష యందు రచింపఁ బడియెను.

ఆదికవి వాల్మీకి మహాముని రచించిన యీ మహ కావ్యమును నతని పిమ్మట గీర్వాణ భాష యందే పలువురు కవిపుంగవులు గద్య నాటక చంపూ సంగ్రహ గ్రంథములఁ బెక్కింటి రచించి యున్నారు. గీర్వాణాంధ్ర భాషలలో శ్రీ రామాయణమును గద్య పద్య ద్విపద పద యక్షగాన రూపములుగ రచించిన కవిశిఖామణులను వారి గ్రంథములను లెక్కింప వీలు గాదనుటలో మా పొరపాటుండదని మనవిఁ జేయుచున్నాము. ఇఁక నన్య భాషలలో భాషాంతరీకరణ మొనరింప బడిన కవులను వ్యాఖ్యాన కర్తలను విమర్శకుల నిందఱని చెప్పఁ గలవారెవరును లేరు. శ్రీమద్రామాయణ మహాకావ్యోత్కృష్టతను గుఱించి వివులముగఁ జర్చింపఁ దలఁచుట కిది సమయము కాదని యింతటితో విరమించు చున్నాము.

శ్రీరామ కథను ఎందఱెన్ని విధముల రచించినను, నెన్ని సారులు చదివినను విన్నను మానవులకుఁ దనివి తీరుట లేదు, అందువలననే యాదికవి సంస్కృతమున రచించిన గ్రంథము సామాన్యులు చదువుటకును నందలి రసమును గ్రోలి యానందించుటకును నవకాశ ముండదని తర్వాతి కవులు తదితర బాషలలో వ్రాయఁ దలఁచి వ్రాసిరి. అట్టి వారిలో ముఖ్యులఁ గొందఱ మాత్రము పేర్కొందుము.

రంగనాథకవి- శ్రీమద్రామాయణము నాంధ్ర భాషలో రచించిన కవులలో రంగనాథ కవి ప్రథముఁడని యాంధ్రలోక మంగీకరించెనని మేమనఁ బని లేదు. ఈకవి పుంగవుని జనస్థాన వంశ కుల గోత్ర సూత్రాదులఁ దెలిసికొనుట కేయాధారములు గన్పట్టక పోవుట సారస్వత దీక్షాపరులకుఁ జింతఁ గలిగింపక పోదు. రంగనాథకవి కోనబుద్ధ రాజు (బుద్ధారెడ్డి) ఆస్థానకవియై యుండెనని పెద్దలు నిశ్చయించిరి. అతఁడు తన ప్రభువును మెప్పించి బిరుదులనో లేక బహుమతులనో పొందఁగోరి తన పేరున రంగనాథ రామాయణమును ద్విపద కావ్యముగ రచించెను. అద్దానిఁ గొందఱు కోన బుద్ధారెడ్డి యే రచించి తన తండ్రియగు విట్టల రాజున కంకిత మొనరించె నందురు. ఇది విశ్వసనీయమా? అని ప్రశ్నించిన నంతరాత్మ