ద్వితీయాశ్వాసము
68
ఉ. వెండియు విశ్రవస్ఖలితవీర్యమునన్ బలుచూలు దాల్చి బ్ర
హ్మాండవిఖండనోద్భటతరార్భటి మీఱెడువానిఁ గుంభక
ర్ణుండను పుత్రుని సురవరుల్ బెగడందఁగఁ గాంచె నంతన
య్యండజయాన శూర్పణఖ యన్ తనయం గనియెం గ్రమంబునన్ 142
వ. తదనంతరంబున. 143
మ. గుణరత్నాకరుఁ డింద్రియార్థ మరుదంకూరాహివన్యాశుశు
క్షణి విద్యానిధి విశ్రవఃకులహితాచారాశ్రయుం డార్యపో
షణచింతామణి సర్వభూతకరుణాసంగాత్మకుం డౌవిభీ
పణుఁడుం గై కసి గర్భవార్ధిఁబొడమెన్ సంపూర్ణ చంద్రాకృతిన్. 144
తే. ఆకుమార త్రయంబున కాగమోక్త, మార్గమునఁ దండ్రి, జాతకర్మంబు నామ
కరణములు మున్నుగాఁగలకర్మతతులు, క్రమమున నొనర్చయుపనయనము జేసె.
వ. ఇత్తెఱంగున నవ్విశ్రవస్తనూజాతు లుపనీతు లయి తండి వలన నఖిలవిద్యావిశేషంబు
లెఱింగి చిత్ర భానుత్రయసమానులు దినదిన ప్రవర్ధమానులునై వెలయుచుండి
రయ్యనసరంబున. 146
§§§ దశగ్రీవకుంభకర్ణవిభీషణుల బాల్యక్రీడలు §§§
సీ. అలఁతిగట్టులు భుజార్గళనిరర్గళత నుత్పాటించి కందుక ప్రౌఢిఁ జూపు
నుడువీథి నారసి పోయెడువిమానము లందుకొని బిట్టు నేలతోఁ గొట్టి యార్చు
నాశమోన్నతభూరుహములుదాఁ బడఁద్రోచి పఱచుమౌనులడాసి పరిహసించు
శరభసింహమదేభసమితి నీడిచి తెచ్చి గట్టిగా దామెనఁ గట్టి వైచు
తే. గరుడగంధర్వపన్న గాగ్రణుల నెచటఁ
గనిన మీతో భుజాభుజిఁ బెనఁగ వలయు
నిలువుఁడను వార లుఱక వెన్వెంటఁ దగులు
బాల్య లీలావిలోలుఁడై పంక్తిముఖుఁడు. 147
సీ. గిరిదిశాకరిభోగికిటికూర్మములు వ్రాల నం ఘ్రిఘట్టన నుర్వి నడఁగఁద్రొక్కు
నరుణచోదితరథం బట్టిట్టుగాఁబట్టినలినాప్తు బింబంబు నాఁకి విడుచు
బాల సాఁచి దిగీశ పట్టణాభ్యంతరోద్యానపక్వఫలాగతతులఁ గూల్చుఁ.
గనుఁగొన్న వైమానిక శ్రేణి వివృతాస్య బిలగతంబుగ నొక్క పెట్ట మ్రింగు
తే. నెదుటఁబడకున్న మునికోటి వెదకి వెదకి
పట్టి భక్షించుఁ గ్రొవ్వెగఁ దొట్టి గుఱుక
విడిచి నిదురించు లేచు నల్లడలఁ దిరుగుఁ
కుంభకర్ణుండు నడయాడుకొండకరణి. 148
చ. అతనిసహోదరుండు సుజనావనశాలి విభీషణుండు సు
వ్రతములు సల్పుచు శ్రుతిపరంపరయర్థముఁ దండ్రి దెల్పఁగా