7
పీఠిక
సీ. శ్రీరుక్మిణికి మకరికలు చెక్కుల వ్రాసి సత్యకీల్జడలకు బూసరులు సుట్టి
జాంబవతికిఁ గొప్పు చక్కఁగా నిడి మిత్రవిందకుఁ బుక్కిటివిడె మొసంగి
భద్రసిబ్బెంపుగుబ్బల గంధ మలఁది సుదంతకు దిలక మందముగ దిద్ది
కాళింది ముఖఘర్మకణము గోటను మీటి లక్షణయడుగుల లాక్ష యుంచి
తే. నీళకు మణివిభూషణపాళి దొడగి, నవ్యవకులంబు రాధకర్ణమునఁ జెరివి
వెలఁదిమిన్నలు పదియాఱువేలు గొలువ, మించు కృష్ణునిశృంగార మెంచ వశమె. 44
§§§ షష్ఠ్యంతములు §§§
క. ఏవంవిధగుణనిధికిన్, దైవతచాతకఘనాఘనప్రతినిధికిన్
లావణ్యరసాంబుధికిని, సేవకసేవధికి మౌనిచింతావధికిన్. 45
క. పురుషగ్రామణికి నురోం, తరభృతరమణికిని బూతనాప్రాణమరు
ద్ధరణోగ్రఫణికి వినతా, మరమణికి మహామహోరమాద్యోమణికిన్. 46
క. ఆనతవిందునకున్ శ్రుతి, నానటితపదారవిందునకు నుదితయశో
దానందునకు సదాత్మస, దానందున కవితశివశతానందునకున్. 47
క. కందళితానందశతా, నందసుతానూనగాననవనాధృతికిన్
గుందశరత్కందమరు, త్తుందభరప్రభువిభాపృథుయశోరతికిన్. 48
క. నీలమణీనీలఘృణీ, జాలతృణీకరణనిపుణచారుతనునకున్
శూలధరాభీలకరా, వేలశరాకారఘోరవిహృతిఘనునకున్. 49
క. వివిధావతారునకు నఖ, రవిజితతారునకు బరధరశతారునకున్
స్తవనదవప్లుషితసుదృ, గ్భవకాంతారునకు భువనభయతారునకున్. 50
క. వ్రజగజగమనాలోలున, కజగరవరజరఠవారణాభీలునకున్
సుజనైకకృపాళునకున్, గుజనవిఫాలునకు మదనగోపాలునకున్. 51
____________