శ్రీరస్తు
శ్రీ రామచంద్రపరబ్రహ్మణే నమః
శ్రీమదుత్తరరామాయణము
ప్రథమాశ్వాసము .
వ. సమర్పితంబుగా నాయొనర్పం బూనిన శ్రీమదుత్తరరామాయణకావ్యంబు మొదట సంక్షేపరూపంబుగా రచియింపం దలంచిన పూర్వరామాయణకథాప్రపంచంబునకు నాదికారణం బయినసాకేతపట్టణం బెట్టిదనిన.1
§§§ సాకేతపురవర్ణనము §§§
ఉ. శ్రీతరుణీవిహారసరసీజవిరాజితరాజసౌధసం
ఘాతము గోపురస్ఫురితకాంచనకుంభవిభాభిభూతఖ
ద్యోతము ద్యోతమానమణితోరణవారసమేత మొప్పు సా
కేతము వాతసంచలితకేతుపటప్రహతాభ్రజాత మై. 2
§§§ వప్రవర్ణనము §§§
సీ. కృష్ణపక్షావిభావరీవేళలఁ జకోరసమితి చంద్రిక లంచు సంతసింప
వలిపక్రొందళుకుమేల్ వెలిపట్టుఁబుట్టముల్ గట్టినయట్లు దిక్కాంత లలర
గంగాతరంగసంఘము వీటిపైఁ బొర్లి యేలవచ్చె నటంచు నింద్రుఁ డరయ
దారకాకైరవోద్యన్నభఃకాసార ముదుటురాయంచలయునికిఁ దెలుపఁ
తే. బరఁగు శరదంబుధరదిగంబరగురప్ర, కాశపేశలవజ్రసంఘటితవప్ర
దీప్రరోచిఃపరంపరల్ దివముఁ బ్రాకిఁ, పరతమోలీల దూల నప్పట్టణమున.3
§§§ పరిఖావర్ణనము §§§
మ. హరిదశ్వస్ఫురదశ్వఘోరఖురభిన్నా రామభూనారికే
రరసారుట్ఫలనిర్గళద్విమలనీరస్ఫారధారాధరాం
తరవర్తిష్ణుతఁ దోయపూర్తిఁ గని దానన్ మబ్బు ధారాధరా
ఖ్య రహింపన్ జలరాశి వర్థమయి ఖేయస్ఫూర్తిఁ గొల్చెంబురిన్.4
మ. పురిఖేయంబుఁ బయోధియుం గని జనంబుల్ రెంటికిన్ భేదమే
ర్పఱుపం జాలక యున్న బ్రహ్మ వివరింపం బూని వారాశిపైఁ
గర మొప్పన్ మణిముద్ర వైచె నది యౌఁ గాకున్న నీలచ్ఛవిన్
ధరియింపం గత మేమి యేటికి సముద్రఖ్యాతి మున్నీటికిన్.5