పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/30

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

6

శ్రీమదుత్తరరామాయణము

తే. యేకొఱంతయు లేక యస్తోకభక్తి, చే నిజేశునిపరిచర్య సేయు నెపుడు
    ధర్మగుణధామ పతిదేవతాలలామ, భవ్యమతిపేటి నరసమాంబావధూటి. 34

క. ఆనరసమాంబగర్భాం, భోనిధి నమృతాంశుచందమున దానయశో
    నూనవిభావిభవైకని, ధానం బగునప్పయ ప్రధానుఁడు వొడమెన్. 35

మ. దయమానాత్తదయాబ్ధిగుప్తకవివిద్యావైదుషీ భోజభూ
     దయితగ్రామణి పూర్వదాతృమహిమాధఃకారిదానప్రభూ
     తయశోధౌతదిశావకాశుఁడు మహోద భూతవామాంగుడ
     ప్పయమంత్రీశ్వరుఁ డమ్మహామహు నుతింపం జెల్లదే యెయ్యెడన్. 36

తే. వినయమున కిమ్ము దాక్షిణ్యమునకు నెలవు
    సత్యమున కాస్పదము సదాచారమునకు
    బ్రాపు నైపుణ్యమునకుఁ జేపట్టు గొమ్మ
    యలవియె నుతింపఁ గంకంటి యప్పుఘనుని. 37

క. జననుతుఁ డయ్యప్పఘనుం, డనఘు డు చిదురూరినరసయకుఁ దిమ్మమకున్
    దనుజామణి యై గుణములఁ, బెనుపొందిననరసమాంబఁ బెండిలియయ్యెన్. 38

సీ. తలఁప సురాధీశుతల్లి గాకుండెనే నదితి నించుక సాటి యనఁగ వచ్చు
    రూఢిగా దోషాకరునిఁ బెంపకుండెనే ననసూయ నింత జో డనఁగ వచ్చు
    శక్తి గర్భీకరించక యుండెనే నరుంధతి నొక్కగతి నీ డనంగ వచ్చు
    జనులు నిందింప మందునిఁ గాంచకుండెనే ఛాయఁ గొంత సమంబు సేయవచ్చు
 తే. నక్కొదవ లున్న వార లయ్యతివకుఁ బ్రతి
     యౌదురే యని బుధు లెంచ నతిశయిల్లె
     నప్పయామాత్యమౌళి యర్ధాంగలక్ష్మి
     నయదయాదిగుణాలంబ నరసమాంబ. 39

క. అన్నరసమాంబయందు స,మున్నతగుణుఁ డప్పనార్యముఖ్యుఁడు గనియెన్
    సన్నుతినిఁ బాపరాజా, ఖ్యు న్నరసింహాభిధానుఁ గులము వెలయఁగన్. 40

తే. వారిలోఁ బాపరాజాఖ్యవ న్నెఁ గన్న, వాఁడ నేఁ బూర్వకృతపుణ్య వాసనావి
    శేషమునఁగృష్ణ దేవునిఁ జెలఁగికొలిచి, తత్కృపమహాకృతియొనర్పఁదలఁచినాడ. 41

ఉ. కాంచనగర్బశంకరముఖ త్రిదశేంద్రులు ప్రౌఢరీతిఁ గీ
    ర్తించిన మెప్పుతో విననికృష్ణుఁడు మత్కృతకీర్తనం బ్రహ
    ర్షించి వినున్ స్వకీయకృపచే విలసిల్లెడు వాక్కులౌటఁ దా
    ర్వెంచినచిల్కపల్కు వినఁ బ్రీతి వహింపక యుందురే దొరల్. 42

శా. వైదర్భీ విలసద్విలాసమునఁ జెల్వంబూని సత్యో క్తి నెం
     తే దీపించి కళందజోజ్జ్వలరసాప్తిన్ మించి భద్రాత్మకం
     బై దీవ్యద్ఘనలక్షణాశ్రయసమాఖ్యం గాంచుమత్కావ్య మా
     హ్లాదం బిచ్చుగ్రహింపఁ గృష్ణునకు నర్హంబే కదా యెయ్యెడన్. 43.