పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

3

                         §§§ సుకవిప్రశంస §§§

ఉ. ఏకవిజిహ్వఁ దొల్త నటియించె సరస్వతి పాదనూపురో
   ద్రేకఝళంఝళార్భటులు దిక్కులఁ బిక్కటిలంగ నేశుభ
   శ్లోకునిమానసాబ్జమున శోభిలెఁ దారకహంస మట్టివా
   ల్మీకిమహర్షి శేఖరునమేయగుణాకరు నాశ్రయిం చెదన్. 9

మ. ధరణీభృన్మణిమౌళివర్తనములం దళ్కొంది యార్యోక్తివై
     ఖరి ప్రాపించి యహీనవిస్పురదలంకారాప్తి శోభిల్లి భూ
     రిరసారూఢిఁ జెలంగి యర్థవరమైత్రిం జొక్కి మేథా కవీ
     శ్వరులన్ గొల్చెద సన్మమనోహరకళాచంచత్ప్రభావాధ్యులన్. 10

                    §§§ కుకవినిరాకృతి §§§

చ. సరసతఁ దామునుం దెలియఁ జాలరు చెప్పిన నీసు లేక యా
    దరణ వహించి యూఁకొనరు తప్పులె పట్టుదు రొప్పుఁ గన్న మె
    చ్చరు వెడయుక్తు లెన్నుదురు శక్తులు గా రొకఁడై న నింపు చే
    కుఱ రచియింప నట్టి చెడుగుల్ విన నోర్తురె సత్ప్రబంధముల్. 11

వ. అని యిష్టదేవతాప్రణామఖేలనంబును విశిష్టకవి స్తుతిమేళనంబును నికృష్టకవి
    జనావహేళనంబునుం గావించి. 12

                    §§§ కృతి ప్రశంస §§§

మ. పరమశ్రావ్య మఘవ్యయామితకథాభవ్యంబు దీవ్యత్సుధీ
     పరిషత్సంతతసేవ్య మబ్జభవసంభావ్యంబు నై మించును
     త్తరరామాయణ కావ్యమున్ మృదువచోధారార్థ సందర్భని
     ర్భరతత్తద్రసముల్ రహింప రచియింపం బూనితిన్ వేడుకన్. 13

మ. వరుసం దిక్కనయజ్వ నిర్వచనకావ్యం బై తగం జేసె ను
     త్తర రామాయణ మందునన్ మఱి ప్రబంధం బూని నిర్మించు టే
     సరసత్వం బని ప్రాజ్ఞులార నిరసించం బోకుఁడీ రాఘవే
     శ్వరుచారిత్రము నెంద ఱెన్నిగతులన్ వర్ణించినం గ్రాలదే. 14

ఉ. మానక కర్మభూమిపయి మానుష దేహముతో హితాహిత
    జ్ఞాన మెఱుంగు బ్రాహణుఁడు చారుకవిత్వము నేర్చి జానకీ
    జానికథల్ రచింపక యసత్కథ లెన్ని రచించెనేనియున్
    వాని వివేక మేమిటికి వానికవిత్వమహత్త్వ మేటికిన్. 15

ఉ. శ్రీకర రామమంత్ర జపసిద్ధిఁ బ్రసిద్దిఁ వహించి వెన్క వా
    ల్మీకి రఘుప్రవీరుకథలే రచియించి గదా చెలంగె ము
    ల్లోకములందు నెల్లమునులుం గొనియాడఁగ నట్టి దౌటఁ బు
    ణ్యాకర మైనరాముకథ హైన్యము మాన్పదె యెట్టి వారికిన్. 16