పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

శ్రీమదుత్తరరామాయణము

శా. ఆవాల్మీకిమనిషివర్యమతిమంథాహార్యసంశోభితం
     బై విశ్వాతిగకామితార్థఫలదం బై శ్రీపదం బై సుశ
     బ్దావాసం బయి మాధురిం దనరురామాంచత్కథాక్షీరపా
     రావారంబు సమాశ్రయింతుఁ గవితా ప్రఖ్యాతి కర్హంబుగన్. 17

చ. ఇహపర సాధకం బన రహించుప్రబంధ మొనర్ప శ్రీరఘూ
     ద్వహునిచరిత్రమున్ దొరకె వాసిగ నీకృతిరత్నమే మహా
     మహునకు సంతసంబున సమర్పణ సేయుదు నంచు నెమ్మదిన్
     దుహితకు భర్తనారయుజనున్ బలె యోజన సేయు చున్నెడన్. 18

                              §§§ కృతిపతి నిర్ణయము §§§

సీ. పొడువుఁగెంపు వహించుబెడిదంపునినుగెంపురహినింపు కంఠహారంబువాఁడు
    కోమలాంఘ్రులయోర గొనబురింగులు జాఱఁ గట్టినబంగారుబట్టవాఁడు
    శృంగారగతి మీఱి చెలువొంచుకస్తూరితిలకంబుచే ముద్దుగులుకువాఁడు
    మకరకుండలలోలమణిజాలరుచి మీఱఁ దళుకొత్తు చెక్కుటద్దములవాఁడు
తే. తలను వలగొన్నపించెపుదండవాఁడు, విమలశతపత్త్రజైత్ర నేత్రములవాఁడు
    మురళిడాచేతఁ గలజగన్మోహనుం డొ, కండు నాస్వప్నమునను సాక్షాత్కరించె. 19

క. ఏనును నతనిం బొడగని, ధ్యానంబున నలరు శ్రీమదనగోపాలుం
    డౌ నని కలలోననె పర, మానందముఁ జెంది మ్రొక్కియర్చించు నెడన్. 20

ఉ. అమ్మహనీయకీర్తి కరుణాన్వితుఁ డై యను వత్స నీప్రబం
    ధము మదంకితంబుగ నొనర్పు కృతార్థుఁడ వయ్యె దింతె కా
    దిమ్మహి వ సువాహనసమృద్ధరమారమణీయభోగభా
    గ్యమ్ములుఁ గల్గెడుం గృతియు నారవితారకమై ప్రకాశిలున్. 21

తే. శ్రీవెలయ మున్ను విష్ణుమాయావిలాస, యక్షగానంబు మాకెసమర్పణముగఁ
    జేసి తది యాదిగా మేము నీసుధాను, సారి వాక్కులఁజొక్కియున్నార మనఘ. 22

క. అని పల్కి యాకృపాళుఁడు, సనుటయు నే మేలుకాంచి స్వప్నమునందున్
     నను నేలుస్వామిఁ గనఁ గలి, గెనెయని రోమాంచకంచుకితగాత్రుఁడ నై. 23

మ. హనుమద్దివ్యపదారవిందమకరందానందనేందిందిరా
     త్ము ననేకాంధ్రకృతిప్రకల్పససమర్థుం బుష్పగిర్యప్పనా
     ర్యునిసత్పుత్త్రునిఁ దిమ్మనాఖ్యకవిచంద్రున్ మత్సహశ్రోతఁ బ్రొ
     ద్దుననే పిల్వఁగఁ బంచి కన్నకల సంతోషంబునం దెల్పినన్. 24

మ. అతఁ డానందముఁ జెంది నన్నుఁ గని యన్నా జాళువాపైఁడికిం
     గృతవర్ణాంచితరత్న మబ్బినటు లయ్యెన్ నీవు వాక్ప్రౌఢిమన్
     గృతి సేయంగఁ దొడంగు రామకథకుం గృష్ణుండు రా జౌటఁ బ్ర
     స్తుతి గావింపఁగ మాకు శక్యమె భవత్పుపుణ్య ప్రభావోన్నతుల్. 25