పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

శ్రీమదుత్తరరామాయణము


                      §§§ శివస్తుతి §§§

చ. వనితరొ వెండికొండ నెలవంకలు పెక్కు వహించెఁ జూచితే
    యని సరసోక్తిఁ దా ననిన నచ్చపుగందపుఁబూఁత గుబ్బ జా
    ఱిన నునుఁబైఁటకొంగు సవరించుచు నవ్విన గౌరిఁ గౌఁగిటం
    దనిపెడు చంద్రశేఖరుఁ డుదారకృపన్ మముఁ బ్రోచుఁ గావుతన్. 3
 
                    §§§ పార్వతీస్తుతి §§§

ఉ, ఊరక చుట్టుకొన్నఁ గమలోత్పలపంక్తులు వాడు నంచునో
    యేఱును గూర్చి చుట్టితివ యెంతటిజాణవు మేలు మేలు నీ
    నేరుపు మెచ్చవచ్చు నని నిచ్చలు మచ్చిక శంభుఁ గేరు నీ
    హారగిరీంద్రకన్యక దయామతిఁ గోర్కులు మా కోసంగుతన్ . 4
 
                     §§§ బ్రహ్మస్తుతి §§§

చ. భువనములం బ్రసిద్దిఁ గని భూరితరోర్మివరప్రభావ మొం
    ది విధునిరాక కుబ్బుచు నుదీర్ణగుణాంచితరత్నరాశియై
    కవులు సమాశ్రయింపఁ దగి కర్బురగర్భత శ్రీగురుత్వముం
    దవులుసరస్వతీశ్వరుఁ డుదారత మాకుఁ జిరాయు వీవుతన్. 5

                    §§§ సరస్వతీస్తుతి §§§

చ. తనహృదయాంబుజాతమునఁ దార్కొనునాథగతానురాగవా
    హిని వెలి గ్రమ్మఁ జేసెనొకొ యీగతి నాఁగ విధాతచెంగటన్
    దనరి జపాప్రసూనసవిధస్ఫటికాకృతిరక్తిఁ గుల్కు వా
    గ్వనజదళాక్షి మా కొసఁగుఁగాత వచోరచనాచమత్కృతుల్. 6

                   §§§ విఘ్నేశ్వరస్తుతి §§§

మ. కలుషేభావళి నాఁప నంకుశము విఘ్నక్ష్మాధరశ్రేణి వ్ర
     క్కలు గావింప వరస్ఫురత్కులిశమున్ గర్వప్రమత్తారివీ
     రుల బంధింపఁగఁ బాశ మున్నతమనోరుగ్రేణువుల్ మాన్పఁ బు
    ష్కలదానాంబువు లూనువే ల్పడఁచు మత్కావ్యాంతరాయచ్ఛటల్. 7

                   §§§ ఆంజనేయస్తుతి §§§

 సీ. శైశవంబుననె భాస్కరు మ్రింగె నితనితేజమున కేఘనుఁ డింక సదృశుఁ డనుచు
     హనుతటోద్దతి వజ్ర మడఁచె నీతనితనుద్రఢిమ కేమిఁకఁ బోల్పఁ దగు నటంచు
     నురుధాటిఁ గడలిలో మెఱసె నీతనిగభీరతకు నెయ్యది యింకఁ బ్రతి యటంచు
     వాలాగ్రమున గిరుల్ వ్రాల్చె నీతని ధైర్యసంపద కిఁక నెవ్వి సాటి యనుచు
తే. జానకీరామచంద్రు లేశౌర్యవంతు
     పటుగుణస్ఫూర్తు లప్పటప్పటికి నెంతు
     రామహాశాంతు నతిదాంతు నరికృతాంతు
     నతులమతిమంతు హనుమంతు నభినుతింతు. 8