10
శ్రీ మ దు త్త ర రా మా య ణ ము
నేగ్రంథమైనను సద్గతిఁ గూర్పఁ గలదను నమ్మకము తోడనే పై కవులవలె రామాయణమును గాక తాను ఉత్తర రామాయణమును రచింప సంకల్పించెను. ఆవలఁ దన కృతికిఁ దగిన కృతిభర్తను సంపాదింప నెంచి యోజించుచు నిద్రింప స్వప్న మందు శ్రీమదనగోపాలుఁడు సాక్షాత్కరించి, నీవింతకుముందు రచించి నాకు సమర్పించిన విష్ణుమాయావిలాసము అను యక్షగానము వలెనే ఉత్తర రామాయణమును గూడ సమర్పింపు మనియు, నందు వలన నతనికిని నతని గ్రంథమునకును శాశ్వకీర్తి కలుగఁ గలదని చెప్పి యదృశ్యుండై నట్లుఁ గవి తన 19-22 వ పద్యములలో లిఖించెను.
పాపరాజు వేకువన నిదుర నుండి లేచి స్వప్నమున శ్రీమదనగోపాలుడు నాక్షాత్కరించి పలికిన వచనములఁ దనమిత్రుఁడగు పుష్పగిరి అప్పయ్య కుమారుఁ డగు తిమ్మయ్యను బిలిపించి యున్నదున్నట్లు వచింపఁ దిమ్మయ్య మిక్కిలి సంతసించి అన్నా! నీవు కృతిభర్తకై వెదకుచుండ శ్రీకృష్ణభగవానుఁడే నీపుత్రినిఁ బ్రేమించి తనకు సమర్పింపఁ గోరెను కదా! శ్రీమదనగోపాలుఁడే నీయల్లుఁడాయెను గదా! ఔరా! నీవు ధన్యుఁడ వై తివి. నీజన్మము సార్థక మాయెను ,లెమ్ము. సత్వరమున నీకృతిని ముగింపుమని తన మిత్రునిఁ బ్రోత్సహించి తన నిజసదనంబున కేగిన వాఁడయ్యె.
ఇచ్చట మఱియొక యంశమును జర్చింప వలసి వచ్చినది. కొందఱు కంకంటి పాపరాజు తన ఉత్తర రామాయణమును పుష్పగిరి తిమ్మకవి సహాయముతో వ్రాసె ననువారును, పాపరాజు గారికిఁ దాను ఋణపడిన విత్తము నీయఁజాలక తిమ్మ కవి ఉత్తర రామాయణమును రచించి పాపరాజున కొసఁగి తన యప్పును దీర్చుకొనె ననువారును, నట్లొసగిన గ్రంథమును వేయిన్ని యేడువందల తొంబదవ సంవత్సర ప్రాంతమున బాపరాజు తనపేరఁ బ్రకటించు కొనెననువారును గలరు. కాని వీరి పలుకు లన్నియు సత్య దూరములని యించుక యోజించినచోఁ దెలియఁ గలదు. ఈ వదంతి గల్పించిన వారి పలుకులు నమ్మదగినవి కాదని యీ కింది విషయములు చెప్పుక చెప్పుచున్నవి.
1. కంకంటి పాపరాజు కవిత్వము చేతఁగాని దద్దమ్మకాదని యతఁడు వ్రాసిన యాశ్వాసాంత గద్యములే చాటు చున్నవి. అట్టి మహాకవి యితర కవిచే వ్రాయఁబడిన గ్రంథమును దన పేరఁ బ్రకటించు కొనెనను వారాకవి పుంగవునకు మహాద్రోహ మొనర్చిన వారు కాఁగలరు.