పుట:Uttara Ramayanamu Kankanti Paparaju.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

11

ఉపోద్ఘాతము

2. పుష్పగిరి తిమ్మనార్యుఁడు ఉత్తరరామాయణమును వ్రాసి యుండినచో పాపరాజు తన స్వప్న వృత్తాంతమును తిమ్మకవిని తన యింటికిఁ బిలిపించుకొని చెప్పవలసినంత యవసర ముండి యుండదు కదా! అంతకు ముందు తిమ్మకవి యేమైన ఉత్తరరామాయణమును రచించినట్లు గాని రచింప నున్నట్లు గాని యితరు లట్లుండఁ దిమ్మకవియైనను నెచ్చటను వ్రాసి యుండ లేదు.

3. పుష్పగిరి తిమ్మకవి భర్తృహరి నీతిశతకమును, సమీరకుమార విజయమును దప్పఁ దదితర గ్రంథముల రచించినట్లు సాక్ష్య మిచ్చు వారెవరును లేరు,

4. ఏదో పాపరాజుగారి కిచ్చిన గ్రంథమును గుఱించి నేనేలఁ బదుగురకుఁ జాటవలెనని తా నెచ్చటను దాని నామమైనఁ గనఁబఱచ లేదనియు, నటులఁ గనఁ బఱచినఁ బాపరాజున కపయశముఁ దెచ్చిన వాఁడనగుదుననియు భావించి తిమ్మనార్యుడు ఉత్తరరామాయణ ప్రశంసను బొత్తిగ వదలెనని యనుకొందమన్న; తిమ్మ కవి కవిత్వమునకును; ఉత్తరరామాయణ రచనకును నేలాటి సంబంధ ముండి నట్లు కనఁబడదు.

5. కవిత్వమను కళ ప్రారంభమైనది మొదలు గ్రంథకర్తల రచనలఁ బరి శీలించి చూచినచో నే రెండుమూఁడో అంతకంటె యెక్కువో వ్రాసిన ఒక గ్రంథ కర్త శైలిని పోకడలను జూచిన నతని ప్రతి గ్రంథములోని శైలి యుద్దేశములు మున్నగునవి కొంచె మించుమించు ఒకే విధముగ నుండునని పండితులకు మేము చెప్పఁ బని లేదు. ఇఁకఁ బుష్పగిరి వారి గ్రంథములోని రచన పోకడలు మున్నగు వానిని; ఉత్తర రామాయణ రచన పోకడలతోఁ బోల్చి చూచినచో నేలాటి సంబంధ మున్నట్లు కనఁబడనందున నుత్తరరామాయణకర్త కంకంటి పాపరాజు గారే యని తీర్మానింప వలసినదే కాని మఱొకరీతి తీర్మానించుటకుఁ గారణ మగు పడుట లేదు.

గ్రంథప్రాశస్త్యము - ఇక మహా కావ్య లక్షణముల యందించు కేని కొఱత లేకుండ రచింపఁ బడిన యీ గ్రంథ రాజ లక్షణములఁ గూర్చి మేము వ్రాయఁదలఁచుట కంటెఁ బాఠకుల కే వదలి మాశ్రమ తగ్గించుకొనుట లెస్సయని మాతలంపు. ఒక వేళ నాప్రయత్న మొనరించినను దివ్యతర ఫలాహారాదుల ముందిడుకొని తినఁబోవు వారికి దూరమునఁ గూర్చుండి యా పదార్థముల రుచిని వర్ణింపఁ బూని నట్లుండునని మాయభిప్రాయము, వేయేల. ఈ గ్రంథరత్నమున శ్రీ కారము మొదలుకొని యంత్యాక్షరము వఱకుఁ గల ప్రతి పద్యగద్యాక్షరముల పొందికలో గొప్ప పటిమ గలదనియు, నేపద్యమును జదివినను మనోహ్లాదమును గలిగించు