100
శ్రీమదుత్తర రామాయణము
తే. యాగమాంతరహాస్యార్ధ మతఁడె కాఁడె
యన్నిజగముల కధినాథుఁ డతఁడె కాఁడె
యట్టిహరి నెంచ నేరక హంకరించి
నిర్నిమిత్తంబ నిందింప నీకుఁ దగునె. 119
మ. పలుకుల్ వేయును నేల లెస్స వినుమా పౌలస్త్య నామేను నా
యెలప్రాయంబును నామనోగతులు నాయిచ్చాభిమానంబు లా
జలరుడ్ధారికె ధారవోసినవి దుష్కాంక్షల్ విసర్జించి పె
ద్దలు వర్తించు పథంబునన్ మెలఁగు మద్దైవంబుతో డయ్యెడున్. 120
తే. అనిపలికి యందు నిలక భయంబు దొలఁకఁ, గలఁకఁ బిల్లికిఁ దొలఁగురాచిలుకపగిది
నావలికిఁ బోవఁ దేఁటులయావళికిని, నతనునిశరావళికిఁ దాళ కసుర గదిసి. 121
చ. చెలి నునుమోవిపానకముచే వడ దేఱక మోము మోమునన్
బలుమఱుఁజేర్చి ముద్దిడక బాహులతాపరిబద్దుఁ జేసి న
న్నలమియుఁ గౌఁగిలింపక రహస్యముగా బహుబంధవైఖరుల్
దెలుపక పోవ నేల యని తెంపున వేణికఁ బట్టియీడ్చినన్ 122
చ. కలఁక దొలంగ వేదవతి గ్రక్కున బెత్తిలి యెత్తి వ్రేయుడున్
మలచపువేణి నట్టనడుమన్ దెగి చేతికిఁ దున్క చిక్కె నం
దుల కళు కొంది కైకసిసుతుం డిది దీనితపఃప్రభావ మం
చలవడి యున్న నచ్చెలియు నవ్వలికిన్ జని క్రోధమూర్తియై. 123
మ. ప్రళయాగ్నిజ్వలితేక్షణప్రభల నప్పౌలస్త్యునిన్ గాల్చున
ట్టుల వీక్షించి దురాత్మ నిన్నపుడె దుష్టుం డంచుఁ జింతించియున్
దెలివిన్ విశ్రవసుం దలంచుకొని యాతిథ్యంబు గావించి మా
ర్పలుకుల్ వల్కిన నింతయున్ గలిగె నోర్వన్ గూడునే యిం కిటన్. 124
శా. ఘోరస్ఫారమదీయోపదహనక్రూరార్చులన్ నీఱుగా
నీరూపంబు దహింప కోర్చితిఁ దపోనిష్టార్థలోభంబు చే
నోరీ నీ విపు డంటుకొన్న మెయి నేనొల్లన్ జ్వలద్వహ్నిలో
నీ ఱైనిన్ దునిమించుపూనికను జన్మింతున్ ధరన్ గ్రమ్మఱన్. 125
తే. అని మహోగ్రతఁ బలికి క్రోధాగ్నితోడ
నచట యోగాగ్నియును మండునటుల చేసి
యయ్యెదుట నిల్చి శ్రీహరి నాత్మ నునిచి
యేపు సెడి దైత్యుఁడును విన నిట్టు లనియె. 126
ఉ. ఏను నిజంబుగా హరిపయిన్ మది గల్గినదాన నేని నా
పై నలినాక్షుఁ డాత్మ యిడి పత్నిఁగఁ జేకొనుమాట తథ్య మౌ
నేని నయోనిజత్వమున నిద్ధర బుట్టి దశాస్యుఁ బుత్త్ర మి
త్త్రానుజయుక్తిఁ ద్రుంప నెప మయ్యెదఁ గా కని వహ్నిఁ జొచ్చినన్. 127