పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

శీఘ్రముగఁ బొమ్ము, ఓగంగా యసంతరము నీవు భారతీశాపముచేత విశ్వముఁ బావనము సేయునట్టిదానవై దేహధారులపాపముల దహింప భారతమునకుం జనుము. సుదుష్కరం బయినభగీరథునితపముచేత భారతమునకుం గొంపోవంబడి మహీతలమున నతిపూత వై బాగీరథీ సమాఖ్యం బడయం గలవు. ఓప్రియురాలా నాయాజ్ఞ చేత నీవు మదంశసంభవుం డగుసముద్రునికిని నాకలచే జనియించెడు శంతనుమహీపతికిని దయితవు గాఁగలవు. ఓభారతీ గంగాశాపముచేత నీవు నీకలచే భారతమునకుం జనుము. ఓవాణీ చవతులతో నాడినకలహమునకు ఫలమనుభవింపుము. నీవు స్వయము బ్రహ్మసదనమునకుం బొమ్ము. ఆతనికిం గామినివి కమ్ము. గంగ శివాలయమునకుం జనుంగాత. ఇయ్యెడఁ పద్మయే యుండుఁగాత. ఈ లక్ష్మీ మిగులఁ బతివ్రత. మహానుభావురాలు. మంచి శీలముగలది. ధర్మము ప్రవర్తింపం జేయునది. ప్రతివిశ్వముల నామె కలాంశసంభవ లయినయందఱుకాంతలు ను ధర్మిష్ఠలయి పతిప్రతలయి శాంత స్వరూపమును, సుశీలము ను గలవా రై యుందురు. మువ్వురు భార్యలు మూఁడుశాలలు మువ్వురుభృత్యులు మువ్వురు బంధువులు నిజముగ వేదవిరుధ్ధములు. వీరలు మంగళప్రదులు గారు. ఎవ్వారి గృహమున స్త్రీ, పురుషునిపగిదిఁ బ్రవర్తించు. ఏగృహస్థుఁడు స్త్రీవశుఁ డై యుండు. అట్టివారిజన్మము నిష్ఫలము. వారికిఁ బ్రతిపదము నశుభము గల్గు. స్త్రీ, ముఖదుష్ట యగునేని యు యోనిదుష్ట యగునేని యుఁ గలహప్రియ యగునేని యు నట్టిదానిభర్త యరణ్యమునకుఁ బోవజను. గృహమునకంటె మహారణ్యము వర మై యుండు. ఆయరణ్యమున వారలకు జలములు ను స్థలములు ను ఫలములును సంతతము సులభములు. క్రూరనార్యధిష్ఠిత మయినయింట నవి సులభములు గావు. పురుషులకు దుష్టస్త్రీల సన్నిధియందు వాసము బహుదుఃఖావహం బై యుండు. అంతకంటె నగ్నియం దుండుట యుత్తమము.