పుట:Tulasyupakhyanamu Chilakapati Venkataramanija Sarma 1902.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

17

ని ట్లనియె. ॥గంగ॥ ఓపద్మాలయా యిది మహూగ్ర యై కానంబడుచున్నది. ఇది నన్నేమి సేయంగలదో చూతము. ఈవాగధిష్ఠాతృదేవత వాగ్దుష్ట. దీనికిం గలహంబునందుఁ బ్రియంబు గలదు. ఈదుర్ముఖి తన శక్తికొలందిగను తన యోగ్యతకొలందిగను నాతో వివాదంబు సేయనిమ్ము. ఓసతీ యిది స్వబలంబును పరబలంబును విశదీకరింపం దలంచెడిని. మీర లందఱు ను మాయిర్వురకుం గలప్రభావంబును పరాక్రమంబును దెలిసికొనుఁడు. అని యిట్లు సెప్పి యాగంగాదేవి వాణి కివ్విధంబున శాపం బొసంగెను. ఓలక్ష్మీ యెవ్వతె నిన్ను శపియించెనో యది - నదీరూపంబుం జెందుంగాత. అది పాపిష్ణు లుండుమర్త్యంబు క్రిందికిం బోయి కలియందు వారలపాపాంశములను బొందుచుండుంగాత. అని చెప్పిన గంగాదేవివచనములు విని సరస్వతి గంగాదేవిం గాంచి యోసీ నీ వ భూమికిం బోవఁగలవు. పాపిష్ఠుల పాపములం బొందఁగలవు. అని శపియింప నాసమయమున భగవంతుండు చతుర్భుజు లగునలువురుపార్షదులలో నయ్యెడ కేగుచెంచి సరస్వతిని కరమున బట్టుకొని పకస్థలమునం జేర్చుకొని యాసర్వజ్ఞుం డావాణికి బురాతనం బయినజ్ఞానంబు నుపదేశించెను. ఆప్రభువు వారలకుం గలిగిన శాపమునకు ను గలహమునకు ను గలరహస్యంబును వారలకెఱింగించి దుఃఖావేశవివశ లయియుండునాకాంతలకు సమయోచితంబు లగువచనంబుల నిట్లనియె. ॥భగవంతుండు॥ ఓలక్ష్మీ నీవు నీకలచే ధర్మధ్వజుని గృహమునకుఁ బొమ్ము. భూమియం దాతని కయోనిసంభవ యగుకన్యక గాఁగలవు. అందు దైవదోషముచేత నీవు వృక్షత్వమును జెందఁగలవు. మదంశసంభవుం డగుశంఖచూడుఁ డనుదావనాధునికిఁ గామిని వై యనంతరము నాకుం బత్నివిగాఁగలవు. నిక్కువము. భారతమునందుఁ ద్రైలోక్యపావని యగుతులసి యనం బరగెదవు. నీవు నీభారతీ శాపమున నీకలచేతఁ బద్మావతీనది వై భారతమునం బ్రవహింపుము.