Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

తిక్కన సోమయాజి


పతిదేవునికడకుఁ బోయి యాతనివలన మన్ననలనుగాంచి తన వచ్చినపని తెలుపఁగా నాతఁడు తనసైన్యమును బంపి మనుమసిద్ధిదాయాదులను నెల్లూరునుండి పాఱఁద్రోలి మనుమభూపతిని బునరభిషిక్తుని గావించి యుండును. తిక్కనసోమయాజి భారతాఖ్యానమును విన్పించినాఁడనియును, తిక్కన వాదమున గెలిచి బౌద్ధులను హింసింపఁ జేసినాఁడనియుఁ జెప్పెడికథలు మాత్రము కవిసృష్టి యని స్పష్టముగఁ జెప్పఁదగును. తిక్కన గణపతిదేవుని సమ్ముఖముస నద్వైతవాదమును సలిపి బౌద్ధుల నోడించినను నోడింపవచ్చునుగాని వారి హింసలకుమాత్ర మాతఁ డుత్తరవాదియై యుండఁడు. గణపతిదేవచక్రవర్తి యద్వైతవాది యని యతనికూతురు గణపాంబశాసనమునఁ గూడ వక్కాణింపఁ బడియుండుట గణపతికిని తిక్కనసోమయాజికిని సమావేశము గలిగియుండుటను సూచింపుచున్నది.