Jump to content

పుట:Tikkana-Somayaji.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆఱవ యధ్యాయము

కాటమరాజ మనుమసిద్ధిరాజుల యుద్ధము

ఖడ్గతిక్కన విక్రమ పౌరుషాదులు.

మనుమసిద్ధిరాజు మరణకాలమునాటికిఁ బాకనాడును మాత్రము పరిపాలించు చుండెను. మనుమసిద్ధివలనఁ బొందిన యైశ్వర్యమును మాత్రమేగాక కవితిక్కన గణపతిదేవచక్రవర్తివలన నెనిమిదియూళ్లను విశేషమైన యైశ్వర్యమును బడసి యుండెను. అయినను గడవఱకుఁ గవితిక్కనయు, ఖడ్గతిక్కనయు మనుమసిద్దిరాజు విశ్వాసమునకుఁ బాత్రులై యొప్పి యుండిరి. ఖడ్గతిక్కన తనకృతజ్ఞతను మఱువక కడపట మనుమసిద్దిరాజునకును కాటమరాజునకును జరిగినయుద్దములో వీరశయనము గాంచెను. ఈవిషయము కాటమరాజుకథవలన మనకు వ్యక్తమగుచున్నది. విద్యావితరణ పౌరుషాదులయందుఁ గవితిక్కన యెంతప్రఖ్యాతుఁడో వీర్యవితరణపౌరుషాదుల యందు ఖడ్గతిక్కన యంతప్రఖ్యాతుఁడుగ నుండెను. ఇతని మరణకాలమునఁ దల్లిదండ్రులు వృద్ధులై సజీవులుగ నున్నట్లే గనంబడుచున్నది. ఆడువారిలోఁ గాని మగవారిలోగాని కొట్టరువు వారికుటుంబమునఁ బిఱికితన మనుమాట వినరాదనుటకు.