30
తిక్కన సోమయాజి
"తిక్కన కృతి నందిన దశకుమారచరిత్రము నందుఁగూడ నీయంశమును గూర్చి విపులంబుగ నేమియు వ్రాయఁబడ లేదు. సాధ్యమైనంత దనుక దానినే సహాయముగాఁగొని కొంత విచారింప నుద్యమించుచున్నాడను, అయిన దశకుమారచరిత్రము గృతి యిచ్చినకావ్యంబుగాన నందుఁ గృతిపతిని వాడుకరీతిఁ బ్రౌడోక్తుల నగ్గించి యుండునని కొందఱాక్షేపింతురు గాఁబోలు. అందులకు సమాధానము చెప్పెద వినుఁడు. కేతన యందఱివలె గేవలధనాశచే నంకిత మొనర్చినవాఁడు గాఁడు.
అట్టి యాశయుండినపక్షమున మనుమసిద్ధికే యొనర్చి యధికధన మార్జించి యుండును. తిక్కన యనన్య విద్యాపాండిత్యాదులయందుఁ దనకున్న యభిమానాతిశయంబుఁ బట్టియు నట్టిమహనీయుండు ప్రశంసించినం గాని తన సెప్పు కవిత్వము సార్థకత నొంద దనుతలంపునను నతఁడు కృతి యిచ్చంగాని వేఱుగాదు. "కవిత సెప్పి యుభయకవిమిత్రు మెప్పింప, నరిది బ్రహ్మకైన నతఁడు మెచ్చఁ బరఁగ దశకుమారచరితంబు సెప్పినఁ ప్రోడనన్ను వేఱ పొగడ నేల" ఆనుపద్యం బీయర్థమ సూచించు చున్నయది, అదియునుంగాక తిక్కన యట్టిజ్ఞానసంపన్నునకు లేనిపోని స్తోత్రపాఠంబు లుపాలంభరూపంబు లై జుగుప్సాజనకంబు లగుంగాని సంతోషదాయకంబులు గానేరవు. ఇక మనయుపక్రమిత విషయమునకుం బోదము. దశకుమారచరిత్రమునందు గేతన "కనకగిరితటీసంకాశ వక్షస్థలీభాగునకు” అని నుడివి యున్నాఁడు. పద్యప్రారంభమే యిట్లుంటచే మనము యతిప్రాసములకై తెచ్చిపెట్టుకొన్నది. యనఁ గూడదు “శ్రీ రమణీరమణీయమహోరస్థలి విజితకాంచనోర్వీ ధరవిస్తారిత బలుండు" అని యీయంశమునే కేతన మఱియొకచో వ్రాసి యున్నాఁడు. ఏతదాక్యద్వయంబు పరస్పరబలీయము లై నెగడు చున్నవి. వీనిచేఁ దిక్కన పీనంబును విస్తారంబు నగు వక్షంబు గలవాఁ డనుట వ్యక్తము. కృతిపతి యందలి యీవిశేషంబు సూచించు నిమిత్తంబుననే కేతన తనప్రథమ నాంధ్ర పద్యము నందు: