పుట:Tikkana-Somayaji.pdf/17

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
8
తిక్కన సోమయాజి


కొమ్మన గుంటూరునకు దండనాధుఁడుగ నుండెను. కొమ్మనామాత్యునిపుత్త్రుఁడు కవితిక్కన మనుమసిద్దిరాజునకు మంత్రిగనుండెను. సిద్ధనామాత్యుని కుమారుఁడు ఖడ్గతిక్కన సిద్ధి రాజునకు మంత్రిగను సేనాపతిగ నుండెను. ఇట్లు తండ్రులును కొడుకులును మనుమలును మంత్రిత్వాది పదవులను వహించి యుండఁగా మంత్రిభాస్కరుఁడు సామాన్యగృహస్థుఁ డని నమ్మించుట కై ప్రయత్నించుట మిక్కిలి శోచనీయము. ఆకాలమునఁ బ్రఖ్యాత మైన మంత్రిభాస్కరునివంశము తామర తంపరవలె వర్దిల్లుచుండెను. వాని నల్వురు పుత్త్రులకును సంతానము గలదు. మంత్రిభాస్కరుని మనుమలలోఁ జరిత్రమునఁ బ్రసిద్ధి గాంచినవారు సిద్ధనామాత్యుని పుత్త్రుఁ డగుతిక్కనయును కొమ్మనామాత్యుని పుత్త్రుఁ డగు తిక్కనయును నిరువురును మాత్రమె. కొమ్మనామాత్యుఁడు లౌకికాధికార ధూర్వహుం డగుటయెగాక వైదికాచార నిష్టాపరుఁ డై యుండె ననికూడ పవిత్రశీలుఁ డనియును, సాంగవేదవేది యనియును తిక్కన వర్ణించిన దానినిబట్టి విస్పష్టమగు చున్నది. ప్రాచీనకాలమున ద్రోణాచార్యాది ద్విజవర్యులు బ్రాహ్మణధర్మమును క్షత్రియ ధర్మమును రెంటినిగూడ సమర్థించుకొని నట్లుగా మంత్రి భాస్కరుఁడును వానికుమారులును మనుములును గూడ సమర్జించుకొనుచు వచ్చిరి.