రెండవ యధ్యాయము
తెలుఁగు చోడరాజులు
కొట్టరువు భాస్కరమంత్రి తనయులలో మూఁడవవాఁడగు సిద్దన తిక్కభూపాలునకు మంత్రిగను సేనాపతిగ నుండెననియును, కొంతకాలము గడచిన పిమ్మట మంత్రిభాస్కరుని నాలుగవ కుమారుఁ డగు కొమ్మన దండనాథుఁడు గుంటూరు సీమనుండి నెల్లూరునకు వచ్చి కాపురముండెననియును మనము తెలిసికొని యున్నారము. తిక్కరాజు విక్రమసింహపుర మను బిరుదునామముచేఁబ్రసిద్ధిగాంచిన. నెల్లూరు ముఖ్యపట్టణముగాఁ జేసికొని తనరాజ్యమును గాంచీపురమువఱకును వ్యాపింపఁ జేసి నెల్లూరు, కడప, చిత్తూరు, చెంగల్పట్టు మండలములలోఁ జేరిన విశేషభూభాగమును బరిపాలించి ప్రఖ్యాతి కెక్కిన వాఁడు. ఇతఁడు తెలుఁగు చోడుల తెగలోని వాఁడు. తెలుఁగు దేశమునందలి చోడరాజులను తెలుఁగు చోడరాజు లనియును, తమిళ దేశమునందలి చోడరాజులను తమిళచోడరాజు లనియును, కన్నడదేశమునందలి చోడరాజులను కన్నడచోడరాజులనియును, ఇటీవలి చరిత్రకారులు వ్యవహారనామములను గల్పించి మూఁడు తెగలవారినిగా విభజించి యున్నారు. గాని మొదట వీరెల్లరు నొక్క తెగవారుగానే యుండి రని చెప్పవచ్చును.