పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నుంచీ మా శకుంతలతో బాటు పూజించిన మహాత్మాజీ ఆహింసాభావం నన్ను వదలక దెయ్యంలా పట్టుకుంది.

   సుశీల నానాటికీ  తేరుకుంది. ఓరోజు సాయంకాలం  నేను సుశీల యింటికి వెళ్లాను. నా మనస్సులో ఆవేదనలు అణిగి ఉన్నాయి. నాకు అంత చైతన్యంకాని, హుషారుకాని లేక, ఏదో బొమ్మలా  తిరుగుతూ ఉన్నాను. మా అమ్మ ఏమిచేసి పెడుతుందో ఏంతింటున్నానో   నాకా రోజుల్లో  తెలియనే తెలియదు. అప్పటికి సుశీలకు  జబ్బు నెమ్మదించి నాలుగు నెలలు అయింది. వసంతకాలం  రోజులు. మత్తుదినాలు. ఆరోజు సాయంకాలం సుశీల యింటికి వెళ్ళగానే  ఆనాలుగంతస్థుల పూర్వకాలం  మేడపై, డాబామీద కుండల్లో  పూల మొక్కల మధ్య, తివాసీ పైన  పరచిన  దిండ్లమీద ఆనుకొని పడుకొని ఉంది.
   నే  నామె దగ్గరకు వెళ్లాను. ఆమె  ఒయ్యారం, కులుకు, అప్పుడే వస్తూన్న గిరజాలజుట్టు, కొత్తరకం! వేసవికాలంలో  హిమాలయాలలో  పొంగివచ్చే శైవాలినిలాంటి క్రొత్తదనంతో వరూధినిలా ఒరిగివుంది. నేను రాగానే ఇలారా, మూర్తీ!అంది.
   నేనామె దగ్గరకు వెళ్లి  కూర్చున్నాను. ఆ డాబామీద  వాళ్ళు  ప్రక్క డాబామీద వాళ్ళకు కనబడకుండా చుట్టూ  ఎత్తుగా  తడికెలు  కట్టి  ఉన్నాయి.మూర్తీ! నీకోసం బ్రతికా సుమా! అని ఆమె అన్నది.       
                                                                                                                      23
   నేను మౌనంగా  సుశీల ప్రక్కనే  కూచున్నాను. నా శకుంతల  కూడా ఇలా బ్రతకరాదా? ఆమె బ్రతికితే! ఓ దౌర్భాగ్యుడా! నీ కంత పవిత్రవరం  ఎక్కడ దక్కనురా! ఓయి ఛండాలుడా! సర్వరసపరిపూర్ణ  మహాభావం గ్రహించే   ప్రతిభ  ఎక్కడరా? ఓయి  నష్టాత్ముడా! ఆ  అప్రతిమాన సౌందర్యనిధిని అనుభవింప నీ  వెక్కడ తగుదువురా! ఓయి మురికి గోతుల  పొర్లాడేపందీ! నీకా  అసదృశ దివ్యతేజస్సు  భరింపశక్తి ఎక్కడరా?
   సుశీల నాతో ఏమి మాట్లాడిందో తెలియదు. కొంత మనస్సు ఇటు తిరిగేటప్పటికి  సుశీల నన్ను గట్టిగా, అప్పుడే పొంగి మరల తమతొల్లింటి పీనత్వం  సంపాదించుకొనే వక్షోజాలను అదిమి నామోమంతా  ముద్దులతో  ముంచివేస్తున్నది. ఈ హీనావస్థ నాకు నేనై తెచ్చుకున్నాను. నాగోయి నేను  తవ్వుకొన్నాను. నాకు మతిలేదు. శకుంతలా స్మృతి మాయమైంది, ఏదో శూన్యభావమే నా ఎదుట, నాచుట్టూ , నాలో! 
   సుశీలాదేవి, ఎన్ని విలాసాలు, కురిపించిందో! నాకు చైతన్యం ఏది? ఆమె నా లాల్చీ విప్పి అవతలవేసిన సంగతి నాకు తెలియదు. చిన్నపిల్లవాడి   వలె ఊరుకున్నాను కాబోలు! లాల్చీలోపల బనీను విప్పుతుంటే ఊరుకున్నాను కాబోలు! సుశీల ఉదయకాల  హిమాచలసానువుల నాక్రమించిన సువర్ణమేఘశకలంలా  నన్ను  ఆక్రమించి ఉండగా  మెలకువ వచ్చింది.