పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చూసి నా కళ్ళు కెంపులేక్కేవి. అతడు కుంగి వణికిపోయేవాడు. అందుచేత మే మిద్దరం ఒకళ్ళోకళ్ళం గౌరవించుకుంటూ దూరదూరంగా ఉంటూంటాము.

3

కల్పమూర్తి సింహంలాంటి మనిషి. అతని వక్షం విశాలమైనది. అతని భుజస్కంధం దిమ్మెసలాంటిది. అతని మెడ పోతబోసిన కంచు. బలం మూర్తికట్టి కోట్లకొలది వానలకు తడిసి, నునుపెక్కిన రాతిబండల్లాగ తిరిగిపోయిన చేతులూ, కాళ్ళూ, వీనికి తగిన ఉన్నత శరీరము, తీరైన ముఖము, కల్ప మూర్తి గ్రీకు అపోలోను మించిన సౌందర్య మూర్తి. కాని కల్పమూర్తి తన మెదడును క్రిందటి జన్మలో మరచిపోయి వచ్చాడు. చెప్పింది త్వరగా అర్ధం చేసుకోలేడు. అర్ధం చేసుకున్నది అతికిచలేడు, అటుకులేని అతని భావాలు అతన్నే కంగారు పెడతవి.

తండ్రి కావలసినంత సంపాదించి యిచ్చాడు. బంగారానికి ఏమీ కొదువలేదు. ప్రయివేటు మాష్టర్ల కష్టఫలితంగా అయిదవ పారం వరకూ ఈడ్చుకు వచ్చాడు. స్కూల్ ఫయినలు పరీక్షకు ఎంత గొప్పవారి అభి మాన మున్నా సున్నలికి మార్కులు కలిపి అతన్ని పైకి ఎట్టా నెట్టగలరు? అంతటితో చదువు చాలించాడు. అతని హృదయం నవనీతం. కల్ప మూర్తి ఒకళ్ళకి ఆవగింజంతైనా కష్టం కలిగించలేడు. పెద్ద డేనుకుక్కలా నా చీర కొంగుల వెనుకనే తిరుగుతుంటాడు. ఆ విశ్వాసము, ఆ భక్తి, ఆ వెఱ్ఱిపూజ, ప్రపంచ శిఖరితమైన అతని మూర్తి, అతని భాగ్యమూ చూసి, ఇంకో స్త్రీ అయితే అతనికి దాసాను దాసురాలు కావలసిందే. సమంగా కోలగా ఉన్న అతని ముఖం చూస్తాను. విశాలమైన ఫాలము, విస్త్రుతాలైన నేత్రాలు, విపంచి రూపంగా ఉన్న నాసిక, విల్లయి పగడాలు చేర్చుకున్న పెదవులు, వియద్గంగా వికసిత హేమపద్మ ముకుళంలాంటి చుబుకము, బంగారపు అతని ఒళ్ళు, అకల్మష హృదయం ప్రతిఫలించే అతని నవ్వూ చూస్తూ ముచ్చటపడిపోతాను. ఒక్క నిమిషం అతడు లేకపోతే నాకు తోచదు. అంతే!

దృడమైన తన బాహువులతో అతడు నన్నదుముకుంటాడనే ఊహ నాకు కంపరం పుట్టిస్తుంది. నా పెదవులను అతని చక్కని పెదవులతో, తనివితో తాకడం అనే ఊహ నన్ను కుంగచేస్తుంది. అతన్ని నా పురుషుడిగా, నా భర్తగా భావించుకోలేను. అతడు నా రసజ్ఞతకు ఆలంబ మైన ఒక వస్తువు మాత్రము.

మోటారు బాగా నడపగలడు. టెన్నిసులో యోధుడు, కుస్తీలో అందెవేసిన చెయ్యి. ప్రయాణాల్లో పెట్టెలు ఖాళీచెయ్యడం, టిక్కెట్లు తెప్పించడం, సర్వసౌకర్యాలను సమకూర్చడం అతనికి ఉగ్గుబాల విద్య. ఎంత కొత్త వాళ్ళయినా అతనికి భయంలేదు. వాళ్ళతో అతడు బాగా స్నేహం చేయగలడు. రైల్వే ఇంజనీర్లు, కలెక్టర్లు,