పుట:Thupanu, by Adavi Bapi Raju.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మునుపటి విధంగా కాబోవు అత్తగారింటికి తరచుగా వెళ్ళడము మానినాను. మాయింట్లోనూ పెళ్ళిపనులు ప్రారంభించినారు. వివాహము వైశాఖ శుద్ధి దశమినాడు. ఒక నాడు మా పురోహితుని భార్య మా అమ్మగారి దగ్గరకు వచ్చి ఏవో మాట్లాడుతున్నది. ఆ ప్రక్క గదిలో కలలు కంటున్న నాకీ మాటలు వినిపించాయి. 'వాళ్ళిద్దరి స్నేహము అలాంటిదండి. నేను కాపరానికి వచ్చి యిప్పటికి నలభై ఏళ్ళయినది. అప్పటినుంచీ వీళ్ళద్దరి స్నేహ మెరుగుదును. కృష్ణార్జునుల్లా ఉండేవారు. వినాయకరావుగారికీ, మీ వారికీ సంతానము కలిగినప్పటినుంచీ వియ్యం అందడమనే గాఢమైన కోర్కె మీ రెరగనే ఎరుగుదురు. ఆ కోర్కె యిప్పటికి ఫలించినందుకు శేషాచలపతిరావు గారు కళ్ళారా చూచి ఎంతో ఆనందించి ఉందురు. కళ్ళెంట నీళ్ళు పెట్టకండమ్మా. శుభసమయంలో మంచిదికాదమ్మా. ఎప్పటి దు:ఖాలప్పటికి భగవంతుని చేతిలో విడిచి సంసారము మోస్తూనే ఉండాలి.' ఆ మాటలు వింటూనే నేను లేచి మా తండ్రిగారి ఫోటో దగ్గరికి వెళ్ళి ఆయన కళ్ళల్లోనికి దీర్ఘంగా పారకించి చూచినాను. నాకు కళ్ళనీరు తిరిగింది. ఏదో భక్తీ, ఏదో సంతోషము నన్నావహిస్తున్నవి.

శుభముహూర్తంలో కన్యాదాన ఫలం చూరగొంటూ, వినాయకరావుగారఖండ వైభవంగా తమ ప్రధమకుమార్తె వివాహము చేసి ధన్యుణ్ణయాననుకొన్నారు.

ఠీవిగా ఆలంకరించుకొని మే మిద్దరము ముత్యాల పల్లకిలో ఊరేగినాము. మా అక్కగార్లిద్దరూ ఆడబిడ్డ లాంఛనాలకై చెరియొక వేయి రూపాలయ మూటలు అతిగర్వముగా అందుకొన్నారు. ఆ ఐదురోజులు మా అమ్మగారు బయట కానరాలేదు. ఆమె లోలోన ఏమి కుళ్ళికుళ్ళి దు:ఖించినదో, పైకి మాత్రం అతిశాంత గాంభీర్యాలతో వచ్చిన చుట్టాలను వేయికళ్ళతో కనిపెట్టి చూచినది. శకుంతల నా ఎడమ చిటికెనవ్రేలు పట్టుకొని నాతో అగ్నిహోత్రముచుట్టూ ఏడడుగులూ వేసినది. వసిష్ఠులు మా చేత ఏ మంత్రాల్ని పఠింపచేశారో కాని ఆ పవిత్ర మంత్రాలకుకూడ అతీతమైన మహామంత్రభావమే నన్నప్పుడొక ఋషితుల్యుని చేసినది.

నా చిన్ననాటి యీ అందాలబాల నాతో ఈ జీవితమార్గాన్ని ఏమె కాదు ఏడుకోట్లడుగులున్నూ నడవవలసిందే! ఆమె అడుగు లతిసుకుమారములైనవి. పవిత్రరేఖా చిహ్నితములు. ఆ అడుగులపైన ఎర్రటి పారాణి నా హృదయంలో రాగాలు దిద్దినది. అన్నట్లు నా శకుంతల దేవివలె ప్రకాశించినది.

'నేనూ, శ్రీనాధమూర్తి బావా వచ్చినాము, తలుపుతీయండి' అని ఆమె అన్న పలుకులు, న న్నంతవరకూ ఆవరించుకొని ఉన్న బాల్యత్వాన్ని క్రిందకు లాగి పారవేసినవి. నేనప్పుడు పురుషుణ్ణయి, 'నేనూ, శకుంతలా వచ్చినాము, తలుపు తీయం'డని నెమ్మదిగానూ అతి గంభీరంగాను సుమంగళీ సమూహము ఎదుట పలికితిని.